ఎమ్మెల్సీ ప్రచారానికి కేంద్ర మంత్రులు

పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నిక ఏదైనా, ప్రతి రాజకీయ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాయి. అయితే  ఇక్కడ ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క పద్ధతి. అందులో భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షా జోడీ  అనుసరిస్తున్న వ్యూహం కొంచెం భిన్నంగా, ఉంటుంది. బూత్ ఆ క్రింది స్థాయి నించి ప్రతి ఒక్క ఓటుకు ఎవరో ఒకరిని బాధ్యులను చేస్తూ, వివిధ స్థాయిల్లో వ్యూహాత్మకంగా బాధ్యతలను అప్పగించడంతో పాటుగా ప్రచారంలో పార్టీ  అగ్రనేతలను, కేంద్రమంత్ర్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల రంగంలోకి దించడం ఆనవాయితీగా వస్తోంది. 

తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు సుమారు ఓ పది మందికి పైగానే కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలు అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.   ఇలా స్థానిక ఎన్నికల్లో కేంద్ర మంత్రులు ప్రచారం చేయడం ఏమిటని, ముఖ్యంత్రి కేసీఆర్, మంత్రి కేటీ రామారావు, తెరాస నాయకులు,మంత్రులు ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఆక్షేపణలు చేసినా, అవహేళనే చేసినా, కమలనాధులు పట్టించుకోలేదు. 

 అదేదో సినిమాలో ఎప్పుడు వచ్చామన్నది కాదు .. బులెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా, ఎవరొచ్చారు,ఎవరు ప్రచారం చేశారు, ఏ స్థాయి ఎన్నికలు అన్నది కాదు ..గెలిచామా లేదా అన్నదే ముఖ్యం అన్నట్లుగా కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ వాలి పోతున్నారు.తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగతున్న ఎన్నికలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్’నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కేంద్ర మంత్రుల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 14 న పోలింగ్ జరిగే వరకు ఈ రాకపోకలు ఇలా సాగుతూనే ఉండేలా బీజేపీ ప్లాన్ చేసింది.