బీజేపీ దుస్థితికి అద్దం పడుతున్న మెదక్ ఉపఎన్నికలు

 

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెదేపాతో పొత్తు వద్దని, బీజేపీయే ఒంటరిగా పోటీ చేసే గెలవగల సత్తా ఉందని ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా అనేకమంది గట్టిగా వాదించారు. కానీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సమర్దులయిన అభ్యర్ధులు కూడా దొరకలేదు. ఎలాగో అతికష్టం మీద అభ్యర్ధులను తెచ్చి నిలబెట్టినా గెలవలేకపోయింది. ఇప్పుడు మెదక్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. పార్టీ తరపున నిలబెట్టేందుకు సమర్దుడయిన ఒక్క అభ్యర్ధి కూడా దొరకకపోవడంతో ఇతరులను నిలబెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరుగుతుందని చాలా ముందే తెలిసినప్పటికీ, అభ్యర్ధిని సిద్దం చేసుకోకుండా నామినేషన్ వేసే సమయం ముగిసేవరకు అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలని చర్చించడం చూస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు గతం నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోలేదని స్పష్టమవుతోంది.  

 

ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 2019 ఎన్నికలలో తెలంగాణాలో తమ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రకటించారు. తెలంగాణాలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ కలలు కంటోంది. బీజేపీ తెలంగాణా ఉద్యమాలలో ఎంత చురుకుగా పాల్గోనప్పటికీ, బీజేపీ సహకారంతోనే తెలంగాణా రాష్ట్రం సాకారమయినప్పటికీ, అందుకే ఆ పార్టీ ఎన్నికలలో గెలవలేకపోయింది. కారణం ఏమిటంటే తెలంగాణా ఉద్యమాల ద్వారా పార్టీ కొంత బలం పుంజుకొనప్పటికీ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులను తయారుచేసుకోవడంలో ఆ పార్టీ విఫలమవడమేనని చెప్పవచ్చును.

 

తన పార్టీ బలాబలాల గురించి బాగా ఎరిగిన బీజేపీ అధిష్టానం తెలంగాణాలో పటిష్టమయిన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకొంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వాపును చూసి బలుపనుకొని తమ శక్తిని అతిగా అంచనా వేసుకొని, తెదేపాతో సయోధ్య పాటించకుండా ఎన్నికలబరిలో దిగి చతికిలపపడ్డారు. వారి అప్రయోజకత్వం వలన ఒక అద్బుత అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు. అయితే నేటికీ తెలంగాణా రాష్ట్ర బీజేపీ నేతలకు తమ ఈ బలహీనత గురించి తెలుసుకొన్నట్లు లేదు. అందుకే నేడు పార్టీ తరపున నిలబెట్టేందుకు తమకు అనుకూలంగా ఉన్న ఇతర పార్టీల నేతల వైపు దిక్కులు చూడవలసి వస్తోంది. ఒకవేళ ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి పోటీలో నిలబెట్టినా అతనిని గెలిపించుకోగలరా లేదా అనేది కూడా అనుమానమే. అందువల్ల కనీసం ఇప్పటికయినా బీజేపీ నేతలు మేల్కొని ఈ ఐదేళ్ళలో పార్టీకి బలమయిన, చురుకయిన రెండవ శ్రేణి నాయకులను తయారుచేసుకొంటే మంచిది. అదేవిధంగా తెలంగాణా తెదేపా నేతలతో కూడా సక్యత పాటిస్తే అది రెండు పార్టీలకు మేలు చేస్తుంది. రెండు పార్టీలు కూడా బలపడే అవకాశం ఉంది.