బీజేపీ గూటికి కిరణ్‌కుమార్ రెడ్డి?

 

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి విఫలయత్నం చేసి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి, ఎన్నికలలో ప్రజల చేత తిరస్కారానికి గురైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాన్నీ నిర్వహించకుండా, అసలు బయట ఎక్కడా కనిపించకుండా వున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి మీద బీజేపీ కన్ను పడినట్టు తెలుస్తోంది. ఆయన్ని బీజేపీలోకి తీసుకోవడం ద్వారా సీమాంధ్రలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని పట్టించుకోలేదుగానీ, రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడం కోసం పోరాటం చేశారన్న సానుభూతి మాత్రం ఆయన మీద వుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్‌ని పార్టీలోకి తీసుకోవడం ద్వారా లాభం పొందాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ ఆలోచనలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన్ని కలిశారు. గంటకు పైగా కిరణ్‌తో కిషన్ రెడ్డి సంభాషించారు. ఈ సంభాషణలో కిషన్ రెడ్డి కిరణ్ కుమార్‌రెడ్డిని బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. కిరణ్ కుమార్ బీజేపీలో చేరితే ఆయనకు ఎలాంటి గౌరవం లభిస్తుందో కిషన్ రెడ్డి వివరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బంతి కిరణ్ కుమార్ కోర్టులోనే వుంది. తమ ప్రతిపాదనకు కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే అనుకూలంటా స్పందించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.