బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇస్తుందా?

 

వచ్చే ఎన్నికల తరువాత రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నసోనియాగాంధీ, ఎలాగయినా తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో పెట్టేందుకు అవసరమయిన యంపీల మద్దతు కూడ గట్టేందుకు, దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమయిన వ్యూహాలు రచించి, అమలుచేస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు చూసుకొంటే, రాష్ట్ర విభజనకు పూనుకొని చాలా భారీ విద్వంసకర వ్యూహమే అమలు చేస్తున్నారు.

 

తెలంగాణా ప్రజల ఆకాంక్షలు మేరకే విభజన చేస్తున్నట్లు పైకి ప్రకటిస్తున్నపటికీ, ఇంత హడావుడిగా వచ్చే ఎన్నికలలోగా తన పధకాన్నిఅమలుచేయడానికి ప్రయత్నిస్తున్నతీరు గమనిస్తే ఇదంతా కేవలం తన రాజకీయ లబ్ధికోసమే చేస్తోందని స్పష్టమవుతోంది. నరేంద్ర మోడీ ఒకసారి ప్రధాని కుర్చీలో సెటిల్ అయిపోతే ఇక రాహుల్ గాంధీకి మళ్ళీ జీవితంలో ప్రధాని కుర్చీలో కూర్చొనే భాగ్యం దక్కకపోవచ్చనే ఆలోచనతోనే, అతని రాజకీయ భవిష్యత్తుని చక్కబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ కోట్లాది రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోంటోoది. అయితే పైకి మాత్రం తానొక పవిత్రమయిన కార్యం కోసం తన పార్టీనే పణంగా పెడుతున్న త్యాగామూర్తిలా మాట్లాడుతోంది. తెలంగాణాలో టీ-కాంగ్రెస్, తెరాసల మద్దతుతో, సీమాంధ్రలో కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, వై.కాంగ్రెస్ పార్టీల మద్దతు పొందాలనేది కాంగ్రెస్ యోచన.

 

అయితే ఈ వ్యూహం అమలవ్వాలంటే ముందుగా రాష్ట్ర విభజన జరగాల్సి ఉంటుంది. అందుకు బీజేపీ మద్దతు తప్పనిసరి. బీజేపీ టీ-బిల్లుకి మద్దతు ఇస్తానని నేటికీ హామీ ఇస్తున్నపటికీ, దానితోబాటే సమన్యాయం పల్లవి కూడా ఆలపించడం మరిచిపోవడం లేదు. అందువల్ల బీజేపీని గుడ్డిగా నమ్మికాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ ఆఖరి నిమిషంలో బిల్లుపై మాటమార్చితే కాంగ్రెస్ ఇరకాటంలో పడక తప్పదు. అటువంటి పరిస్థితే వస్తే, తను క్షేమంగా బయటపడే వ్యూహాలు కాంగ్రెస్ సిద్దంచేసుకొనే ఉంటుంది. బహుశః అందువలనే దిగ్విజయ్, షిండే, ఆజాద్, కమలనాథ్, మొయిలీ తదితర కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా బిల్లు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెడతామని ఒకరంటే, కాదు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని మరొకరు చెపుతూ బిల్లుపై బీజేపీతో దాగుడుమూతలు ఆడుతున్నారు.

 

కానీ కాంగ్రెస్ దేశముదురయితే, బీజేపీ మహా ముదురు పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న తెలంగాణా బిల్లుకి మద్దతు ఇస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకే పేరు, ప్రయోజనం కలుగుతాయి తప్పతనకు కలగవనే సంగతి కొంచెం ఆలస్యంగానయినా గ్రహించగలిగింది. తాను ఏ కాంగ్రెస్ పార్టీని వచ్చేఎన్నికలలో మట్టి కరిపించి కేంద్రంలో అధికారంలోకి రావాలని తపిస్తోందో, అదే పార్టీ ప్రవేశపెడుతున్నబిల్లుకి ఇప్పుడు మద్దతు ఇస్తే, చేజేతులా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, తన పార్టీని తనే దెబ్బ తీసుకొన్నట్లవుతుంది. కనుక, బీజేపీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయకపోవచ్చును.

 

కానీ, బిల్లుపై ‘యూ టర్న్’ తీసుకొంటే, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి, తెరాస, టీ-కాంగ్రెస్ నేతల నోటికి బలయిపోవడం ఖాయం. కనుక తను ఇప్పుడు ఆలపిస్తున్న’సమన్యాయం’ పల్లవితో బాటు మరో కొత్త రాగమేదయినా ఆలపించవలసి ఉంటుంది. తెలంగాణా బిల్లుపై టీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసారు. వాటిని పట్టుకొని తెలంగాణాకు చాలా అన్యాయం జరుగుతోందని వాదిస్తూ బీజేపీ ‘యూ టర్న్’ తీసుకోవచ్చును. తాము అధికారంలోకి రాగానే బిల్లులో లోపాలను సవరించి తెలంగాణా ప్రజలు, నేతలు కోరుతున్నట్లు ఎటువంటి షరతులేని సంపూర్ణ తెలంగాణా ఇస్తానని హామీ ఇస్తూ బీజేపీ ప్రజలవద్దకు వెళ్ళగలదు.

 

ఇక తను చాలా పట్టుదలగా, చిత్తశుద్దితో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుచేయబోతే, బీజేపీ దానికి మోకాలు అడ్డిందని, లేకుంటే ఈ ఎన్నికలు తెలంగాణాలోనే జరిగి ఉండేవని, అందువల్ల ప్రజలు మళ్ళీ తనకే ఓట్లేసి గెలిపించినట్లయితే అధికారం చెప్పట్టగానే వెంటనే తెలంగాణా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల వద్దకు వెళ్ళవచ్చును.

 

అందువల్ల పార్లమెంటులో బిల్లుకి మద్దతు అనేది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాదు, రాజకీయ సమస్య కూడా అని దీని వల్ల అర్ధం అవుతోంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బిల్లు గురించి ఎన్నిమాటలు చెపుతున్నపటికీ, బిల్లు పార్లమెంటులో ఓటింగ్ వచ్చేసమయానికి అందరూ మాట మార్చి వెనక్కి తగ్గడం ఖాయం. అందువల్ల వచ్చేఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చును.