రాష్ట్ర విభజనపై బీజేపీ కూడా ద్వంద వైఖరి

 

తెలంగాణా ప్రజల ఆకాంక్షలను తీర్చేఉద్దేశ్యంతో కాక, కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ, సీమంద్రాలో తన పార్టీని పణంగా పెట్టి మరీ తెలంగాణా ఏర్పాటు చేస్తోందనేది కాదనలేని నిజం. రాష్ట్ర విభజనతో కేసీఆర్, జగన్ లద్వారా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచేందుకు అవసరమయిన యంపీలను పొందాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఏదోవిధంగా ఈ పని పూర్తిచేయాలని గట్టి పట్టుదలతో ఉంది. కానీ సీమాంధ్ర నుండి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేఖత, ఒత్తిళ్ళ కారణంగా కొంచెం మెల్లగా పోవలసి వస్తోంది.

 

సరిగ్గా ఈ కారణం చేతనే బీజేపీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలాగే వ్యవహరిస్తోంది. మోడీ హైదరాబాదు పర్యటనలో రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడితే, వెంకయ్య నాయుడు సమన్యాయం పల్లవి అందుకొన్నారు. ఆ తరువాత ఆ పార్టీ నేత సుష్మా స్వరాజ్ తెలంగాణాకు తమ పార్టీ అనుకూలమని, పార్లమెంటులో బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కానీ ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తమ పార్టీ ‘విద్వేషాలతో కూడిన విభజన కోరుకోవట్లేదని’ కొత్త మాట చెప్పి పార్టీ వైఖరికి మరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

 

రాష్ట్రంలో బీజేపీ గెలుపోటముల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కనుక ఆ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి రావడానికి అనువైన వైఖరినే తెలంగాణా విషయంలో కూడా అవలంబిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రవేశపెట్టే తెలంగాణా బిల్లుకి మద్దతు ఈయడం వలన బీజేపీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.

 

‘తెలంగాణా ఇచ్చిన ఘనత మాదే’ అంటూ టీ-కాంగ్రెస్ నేతలు అప్పుడే విజయోత్సవాల పేరిట డప్పుకి సిద్దపడుతుంటే, ‘మా పోరాటం వలనే తెలంగాణా వచ్చిందని’ తెరాస చాటింపు వేసుకొంటోంది. అందువల్ల ఇక అక్కడ బీజేపీకి జాగా లేదు. అటువంటప్పుడు బిల్లుకి మద్దతు ఇవ్వడం కంటే ఏవో కుంటి సాకులు చెప్పి తప్పుకొని తెలంగాణా బిల్లును నిలిపి వేయగలిగితే, అది కాంగ్రెస్-తెరాసల బంధాన్ని దెబ్బ తీస్తుంది.

 

తెలంగాణా ఏర్పాటుకి సహకరిస్తే అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయిన తమకు పెద్దగా తేడాలేదని ముందే కేసీఆర్ ప్రకటిస్తున్నారు. గనుక, తెలంగాణా ఏర్పాటుకి సహకరించి, కాంగ్రెస్-తెరాసలను స్వయంగా గెలిపించి తెరాసను కాంగ్రెస్ చేతిలో పెట్టడం కంటే, బిల్లుని ఆపి తెరాసను గెలిపిస్తే, ఒకవేళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే తెరాస మద్దతు తీసుకొని అప్పుడు తాపీగా తెలంగాణా ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ వ్యూహం కావచ్చును. అందుకే బీజేపీ కూడా తెలంగాణపై రోజుకొక మాట మాట్లాడుతోంది.