బీజేపీ కూడా సమైక్యరాగం ఆలపించబోతోందా?

 

“తెలంగాణా అంశంతో కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోంది. తెలంగాణా ప్రజలను మోసం చేస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెడితే మా పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయకపోతే, మా పార్టీ అధికారంలోకి రాగానే కేవలం 100 రోజుల్లోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది,” ఇది బీజేపీ ఇంతవరకు చెపుతున్నమాటలు. కానీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాటలు వింటే ఇప్పుడు బీజేపీ కూడా సమైక్యరాగం అందుకొన్నట్లు కనిపిస్తోంది.

 

“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియను చాలా అనాలోచితంగా, ఎవరికీ ఆమోదయోగ్యం కాని విధంగా చేస్తోంది. జాతీయ పార్టీగా బీజేపీ ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకొంటోంది. సీమాంధ్ర ప్రజలు చెపుతున్నఅనేక సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజనకు యుపీయే ప్రభుత్వం బిల్లు పెడితే, మా పార్టీ మద్దతు తెలపదు. రాష్ట్ర విభజనలో ఇరుప్రాంతాలవారికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మొండిగా ముందుకు సాగాడాన్ని మేము ఖండిస్తున్నాము. అలాగని మేము తెలంగాణా ఏర్పాటుపై వెనక్కి తగ్గినట్లు భావించనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ” అని వెంకయ్య నాయుడు మీడియాతో అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై బిల్లు పెడితే మద్దతు ఇవ్వబోమని స్పష్టంగా చెపుతూనే, మళ్ళీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.

 

ఇక, నిన్న మొన్నటి వరకు కూడా సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ అక్కడ పార్టీని బలపరుచుకోవాలని చూసిన బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నపుడు, తాము ఎంత ఉద్రేకంగా తెలంగాణా కోసం పోరాడినప్పటికీ, ఆఖ్యాతి మొత్తం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని బీజేపీ ఆలస్యంగా గ్రహించినట్లుంది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకోనో లేక ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోనో ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నందున, ఇక తమకు తెలంగాణా తరపున వఖల్తా పుచ్చుకొని ఎంత వాదించినా అక్కడ తమ పార్టీకి ఉన్నరెండు మూడు యంపీ సీట్లకంటే అధనంగా ఒక్క సీటు కూడా గెలవడం అసాధ్యమని బీజేపీ ఆలస్యంగా గ్రహించింది.

 

అదిగాక తన తెలంగాణా వాదంతో, అసలే సీమంధ్రలోపార్టీలో అంతంత మాత్రంగా ఉన్నతమ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయే ప్రమాదం ఉందని బీజేపీకి జ్ఞానోదయం అయినట్లుంది. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతున్నపటికీ, సీమాంధ్ర ప్రాంతంలో ఉదృతంగా సాగుతున్నసమైక్యాంధ్ర ఉద్యమం బీజేపీకి కొత్త ఆశలు రేపడంలో అసహజమేమి లేదు. ఇంతకాలం తెలంగాణావాదంతో ముందుకు సాగుతు అక్కడ బలం పెంచుకోవాలని తపించిన బీజేపీకి కాంగ్రెస్ తీసుకొన్ననిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది. అందువల్ల, ఇప్పుడు సిద్దంగా ఉన్నసమైక్యాంధ్ర లేదా సమన్యాయం ఉద్యమాలతో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని బీజేపీ సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది.

 

అయితే, ఇప్పటికే సీమాంధ్రపై పట్టుకోసం నానా తిప్పలు పడుతున్న కాంగ్రెస్, వైకాపా, తెదేపాలతో బీజేపీ కూడా సమైక్య రేసులో పాల్గొంటుందా? పాల్గొన్నపటికీ ఇంతకాలం తమను పట్టించుకోని బీజేపీని సీమాంధ్ర ప్రజలు విశ్వసిస్తారా? తెలంగాణావాదాని పక్కనపెడితే బీజేపీ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారుతుందని ఆ పార్టీ నేతలకి తెలియదా? అనే ధర్మ సందేహాలకు సమాధానాలు బీజేపీయే జవాబు చెప్పాల్సి ఉంటుంది.