బీజేపీకి వార్నింగ్ ఇచ్చిన ప్రజలు- మోదీ మేలుకొంటారా?

 

నిన్న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇంచుమించుగా వచ్చేశాయి. వీటిని చూసి బీజేపీ శ్రేణులు బావురుమంటున్నాయి. నాలుగు లోక్‌సభ సీట్లలో బీజేపీ ఏకంగా మూడు స్థానాలలో బొక్కబోర్లాపడింది. వీటిలో రెండు బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు ఉన్న స్థానాలు కావడం గమనార్హం. ఒకప్పుడు అచ్ఛేదిన్‌ నినాదంతో దేశాన్ని ఊపేసిన బీజేపీకే ఇప్పుడు రోజులు గడ్డుగా కనిపిస్తున్నాయి. మోదీ- అమిత్‌షాల ప్రభ కొడిగడుతూ ప్రమాదఘంటికలను మోగిస్తోంది.

 

బీజేపీకి అన్నింటికంటే అవమానకరమైన ఓటమి ‘కైరానా’లో జరిగింది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఇప్పటికే అక్కడి గోరఖ్‌పూర్‌ స్థానాన్ని కోల్పోయిన పార్టీ శ్రేణులు పుట్టెడు భారంతో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప్పు నిప్పులా ఉండే ప్రతిపక్షాలన్నీ ఏకమై కైరానాలో గెలుపుని కైవలం చేసుకున్నాయి. పార్టీలకు కావల్సింది విజయమే కాబట్టి, వచ్చే ఎన్నికలలో కూడా ఇలాంటి పొత్తులే జరుగుతాయన్న హెచ్చరికలను అధికార పార్టీకి పంపాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో నూపుర్‌ అసెంబ్లీ ఎన్నికలను కూడా బీజేపీ చేజార్చుకుంది. దాంతో యూపీలో యోగిరాజ్‌ పాలన పట్ల ప్రజలు ఏమంత తృప్తిగా లేరని తెలిసిపోతోంది.

 

మహారాష్ట్ర భాంద్రా, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానాలను కూడా బీజేపీ చేజార్చుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా బీజేపీ పట్ల ఎలాంటి కనికరాన్నీ చూపలేదు. మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన పది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కేవలం రెండే స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల వీస్తున్న వ్యతిరేక పవనాలకు ఈ ఫలితాలను ఓ నమూనాగా భావించడంలో తప్పులేదు. వీటిలో మణిపూర్‌ పరిస్థితి బీజేపీకి సంకటమే! మణిపూర్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌, నేషనల్‌ పీపుల్స్ పార్టీ చెరో ఇరవై స్థానాల్లో ఉన్నాయి. తాజా విజయంతో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దాంతో గవర్నర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ను మరోసారి బలనిరూపణకు ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది.

 

ఇంతకీ మోదీ పాలన మీద ప్రజలు ఎందుకిలాంటి తీర్పునిచ్చారు? ఈ దేశ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రధానమంత్రిగా పేర్కొన్న వ్యక్తిని ఎందుకిలా తిరస్కరించారు? అనే ప్రశ్నలకు చాలా తేలికగానే జవాబులు కనిపిస్తాయి. మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగాలు, ట్విట్టర్‌ సందేశాలలో తప్ప దేశంలో అభివృద్ధి జరిగినట్లు ఎక్కడా కనిపించడం లేదు. అంతర్జాతీయ ర్యాంకులలో దేశం అన్ని విధాలా వెనకబడుతోందనే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగం, బ్యాంక్ కుంభకోణాలు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, స్వచ్ఛ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా... లాంటి పథకాలన్నీ విజయానికి దూరంగానే నిలిచిపోయాయి. వీటికి తోడు రోజు తర్వాత రోజు పెరుగుతున్న పెట్రోలు మంటలు సరేసరి! ఈ మంటలు ఏకంగా ఓటర్ల గుండెల్లోనే మండినట్లు తాజా ఫలితాలు తెలియచేస్తున్నాయి.

 

ఇప్పటికైనా మోదీ మేలుకొంటారా? తన పాలనలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని ఒప్పుకొంటారా? సరిదిద్దుకునేంత ఉదారత చూపిస్తారా? అనుమానమే!