మోడీని నేరుగా డ్డీకొనలేకనే బీజేపీ బలహీనతపై కాంగ్రెస్ దెబ్బ కొడుతోందా?

 

ఒక అబద్దాన్ని వందసార్లు నిజమని గట్టిగా నొక్కి చెప్పినట్లయితే, ఆ అబద్దం కూడా నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు మన పురాణ కాలం నుండి వర్తమాన రాజకీయాల వరకు అనేక ఉదాహరణలున్నాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పనిగట్టుకొని చేస్తున్న విష ప్రచారం కూడా నిజమని నమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానిని నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రజలు నమ్మేరంటే అర్ధం ఉంది కానీ దేశంలో కొందరు మేధావులు, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, ఏఆర్ రహమాన్ వంటి గొప్ప కళాకారులు కూడా నమ్మడం చాలా విస్మయం కలిగిస్తోంది.

 

అటువంటివారందరూ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడిని తీవ్రంగా వ్యతిరేకిస్తే అందుకు వారిని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే దేశంలో ప్రజలందరికీ తమకు నచ్చిన రాజకీయపార్టీకి, నేతలకు మద్దతు పలికే అధికారం స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. కానీ తమకు ఒక రాజకీయ పార్టీ, దాని నేతలు నచ్చకపోయినంత మాత్రాన్న ప్రపంచ దేశాల దృష్టిలో దేశ ప్రతిష్టకు భంగం కలిగించే ఇటువంటి భావనలు వ్యాపింపజేయడం చాలా తప్పు.

 

గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. ఆ సమయంలో దేశంలో అనేక ప్రాంతాలలో మత ఘర్షణలు, అల్లర్లు జరిగాయి. కానీ అప్పుడు ఈ మేధావులు, కళాకారులు ఎవరూ కూడా దేశంలో మత అసహనం పెరిగిపోతోందని భావించలేదు. కానీ ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇస్తున్నవారు దానిని భూతద్దంలో చూస్తూ, చూపిస్తూ ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసారు.

 

“కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన ఘటనలను, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమయిన సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటనలను కూడా మోడీ ప్రభుత్వమే కారణమని వాదించడం గమనిస్తే, వారు ఏ ఉద్దేశ్యంతో ఇటువంటి విషప్రచారం చేస్తున్నారో అర్ధం అవుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడి దృష్టి దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయడంపైనే పెట్టారు. తత్ఫలితంగా కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే దేశం అన్ని విధాల బలపడుతోంది. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భారత్ లో పరిస్థితులు చాలా మారాయని గుర్తించి దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ కొందరు పనిగట్టుకొని చేస్తున్న ఈ విషప్రచారం వలన భారత్ పట్ల ప్రపంచ దేశాలకు ఎటువంటి దురాభిప్రాయం ఏర్పడుతుందో దాని వలన దేశానికి ఎంత నష్టం, అప్రదిష్ట కలుగుతుందో ఆలోచించడం లేదు,” అని వెంకయ్య నాయుడు అన్నారు.

 

ఆయన వాదన సహేతుకంగా ఉందని అందరూ అంగీకరిస్తారు. గత పదేళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో దానికీ తెలుసు. దేశంలో అవినీతిని సర్వత్రా వ్యాపింపజేసి, భారత్ అవినీతికి మారుపేరు అనే భావన ప్రపంచదేశాలకు కలిగించింది. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన దేశప్రజలు దానిని సార్వత్రిక ఎన్నికలలో తిరస్కరించారు. ఆ తరువాత వరుసగా జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికలలో కూడా తిరస్కరిస్తూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం ఆత్మవిమర్శ చేసుకొని, తన తప్పులను సరిదిద్దుకొని, పార్టీని సమూలంగా ప్రక్షాళనం చేసుకొని దేశ ప్రజల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకుండా ఈ విషప్రచారం మొదలుపెట్టింది. దానికి కాంగ్రెస్ అనుకూలురు, బీజేపీ, మోడీ వ్యతిరేకులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారు.

 

మోడీ ప్రభుత్వం అధికారం చేప్పటిన తరువాత దేశంలో వివిధ రాష్ట్రాలలో ఒక ఊపుగా మొదలయిన ఆర్ధిక, పారిశ్రామిక రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని, ప్రపంచ దేశాల దృష్టిలో పెరుగుతున్న భారత్ గౌరవం గురించి కాంగ్రెస్ మాట్లాడలేకపోతోంది. అలాగే మోడీ ప్రభుత్వంలో వేలెత్తి చూపడానికి అవినీతి కూడా కనబడటం లేదు. కనుక మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని దాని బలహీనతపై దెబ్బ తీసేందుకే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఈ విష ప్రచారం మొదలు పెట్టాయని అనుమానించక తప్పదు. కానీ ఆ ప్రయత్నంలో దేశానికి జరుగుతున్న కనబడని నష్టం గురించి వాళ్ళెవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే వాళ్ళకి దేశ ప్రయోజనాల కంటే తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయాలన్నీ ‘సో కాల్డ్ మేధావులకు’ తెలియవనుకోలేము. అయినా వారు కూడా ఈ విష ప్రచారంలో పాలు పంచుకొంటున్నారంటే అటువంటి వారిని నెత్తిన పెట్టుకొని మోస్తున్న దేశ ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలి.