TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆన్‌లైన్ ఆర్డర్…షాక్ ఇచ్చిన బిర్యానీ...హోటల్ సీజ్

Published on: Tue Apr 7, 2026 6:33PM

 

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీ తెరిచి చూసే సరికి దుర్వాసన రావడంతో వినియోగదారు షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంకటరమణ కాలనీలో నివసిస్తున్న కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కొద్దిసేపటికే “లక్కీ బిర్యానీ షవర్మ” నుంచి ప్యాకెట్ చేరింది. ఆకలితో వెంటనే బిర్యానీ పొట్లం తెరిచి చూడగానే తీవ్ర దుర్వాసన రావడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిశీలించగా బిర్యానీ పూర్తిగా కుళ్లిపోయిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఫిర్యాదు అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్‌లో సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని నిల్వ ఉంచి, ఆర్డర్ వచ్చినప్పుడు మళ్లీ వేడి చేసి కస్టమర్లకు పంపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా హోటల్‌లో పరిశుభ్రత పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని అధికారులు తెలిపారు.

ఫ్రిడ్జ్‌లో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వెంటనే హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై వినియోగదారుల్లో భయం నెలకొంది. ఆహారం ఆర్డర్ చేసే ముందు రెస్టారెంట్ రేటింగ్స్, రివ్యూలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.