సిగరెట్ల కోసం చూస్తున్న పిట్టలు..


సాధారణంగా పిట్టలు తమ గూళ్లను.. ఆకులు, ఎండు పుల్లలు కాస్త తేలికపాటి వస్తువులు  కాగితాలు, ప్లాస్టిక్‌ సంచులతో నిర్మించుకుంటాయి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఓ పిట్ట ఏకంగా సిగరెట్ ను తన గూటికోసం వాడటానికి తీసుకెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.... ఈ మద్య పిట్టలు మానవులు తాగి పడేసే సిగరెట్‌ పీకలను ప్రధానంగా పట్టుకెళతాయట. ఇంతకీ పిట్టలు ఈ సిగరెట్లను ఎందుకు తీసుకెళుతున్నాయనే కదా డౌట్.. దానికీ ఓ రిజన్ ఉంది. ఏంటంటే.. ఆ పీకల ఫిల్టర్‌లో ఉన్న దూది గూడు అల్లికకు బాగా పనికొస్తుందట. ఆ ఉద్దేశంతో పీకలను పిట్టలు పట్టుకెళుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేషనల్‌ అటానమస్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మెక్సికోకు చెందిన డాక్టర్‌ సౌరెజ్‌ రోడ్రిగెజ్‌ కనుగొన్నారు. చిన్న చిన్న కీటకాలు గూళ్లలోకి ప్రవేశించకుండా, తమ పిల్లలకు హాని చేయకుండా ఉండేందుకే పిట్టలు ఈ ఫిల్టర్‌ దూదిని ఉపయోగిస్తున్నాయని డాక్టర్‌ నిరూపించారు. గూళ్ల సాధారణ లైనింగ్‌ను తొలగించి ఫిల్టర్‌ దూది లైనింగ్‌ను కొత్తగా ఏర్పాటు చేసుకోవడాన్ని గమనించారు. సూక్ష్మ క్రిమికీటకాలు ఫిల్టర్‌ దూది జోలికి రాకపోవడాన్ని కూడా గుర్తించారు. డాక్టర్‌ తన ప్రయోగం పూర్తి వివరాలను ‘ఏవియన్‌ బయోలోజి’ తాజా సంచికలో ప్రచురించారు. మొత్తానికి సిగరెట్లు తాగితే మనిషి ప్రాణాలకు ముప్పు కానీ.. అదే సిగరెట్ పిట్ట ప్రాణాలు కాపాడుకోవడానికి పనికొస్తుంది.