శబరిమలలోకి ప్రవేశించిన మహిళలకు ప్రాణహాని!!

 

శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు.. బిందు, కనకదుర్గ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 2న అయ్యప్ప ఆలయాన్ని బిందు, కనకదుర్గ దర్శించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. హిందూ సంఘాలు వీరిపై మండిపడ్డాయి. ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలపై దాడి చేస్తామని కొందరు ప్రకటించడంతో ఆ మహిళలు కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారం రోజుల తర్వాత అత్తగారింటికి వచ్చిన కనకదుర్గపై హిందూ సంప్రదాయాలను మంటగలిపావంటూ ఆమె అత్త దాడి చేసింది. తలకు గాయమైన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తమపై దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ఇద్దరు మహిళలు.. తమకు భద్రత కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.