TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

6 నెలల్లో తేజస్వినే బీహార్ సీఎం ! అధికార  జేడీయూ ఎమ్మెల్యే సంచలనం 

Published on: Fri Jan 8, 2021 1:10PM

బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరబోతున్నారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరగగా... ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఖండించారు. అయినా బీహార్ కు త్వరలోనే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితారనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా అధికార జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ కూడా అలానే కామెంట్ చేశారు. 

మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని కూడా జేడీయూ కీలక నేత  చెప్పడం ఆసక్తిగా మారింది.  

 జేడీయూ సీనియర్ నేత , ఎమ్మెల్యే గోపాల్ మండల్, బిహ్‌పూర్ ఎమ్మెల్యే  శైలేంద్ర మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది.అంతేకాదు బీజేపీ జిల్లా చీఫ్ రోహిత్ పాండేపైనా మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. భాగల్పూర్ నుంచి బరిలోకి దిగిన రోహిత్ పాండే కాంగ్రెస్ నేత అజీత్ శర్మ చేతిలో ఓడిపోయారు. అయితే తాను ప్రచారం చేసిన కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, రోహిత్‌కు చాలా పొగరని, అందుకే తాను ఆయన కోసం ప్రచారం చేయలేదని అందులో మాట్లాడారు  జేడీయూ నేత గోపాల్ మండల్. అందుకనే ఆయన ఓడిపోయారని తెలిపారు.  మండల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  అధికార జేడీయూ-బీజేపీ కూటమిలో కలకలం రేగింది.  దీంతో జేడీయూ నేతలు అప్రమత్తమై  గోపాల్ మండల్ తో వివరణ ఇప్పించారు.  ఆ ఆడియో తనది కాదని చెప్పుకొచ్చారు మండల్.  ఎమ్మెల్యే శైలేంద్ర ఈ ఆడియోను వైరల్ చేశారని, ఇదెక్కడి పద్ధతని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేడీయూ ఎమ్మెల్యే ల మధ్య సాగిన ఆడియో మాటలు ఇప్పుడు బీహార్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటి మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది జేడీయూ-బీజేపీ కూటమి. బీజేపీనే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలిచినా.. ముందే ఇచ్చిన హామీ ప్రకారం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అయితే ప్రభుత్వంలో బీజేపీ హవానే సాగుతుందనే చర్చ జరుగుతోంది. జేడీయూ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకు బలం చేకూర్చేలా ఉన్న జేడీయూ ఎమ్మెల్యేల ఆడియో లీక్ కావడంతో... బీహార్ లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.