కాపీ కొడతారని... అర్ధనగ్నంగా పరీక్షలు రాయించారు
Published on: Wed Mar 2, 2016 11:39AM
.jpg)
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ ఈ మధ్య ఒక పరీక్షను నిర్వహించింది. అయితే బీహారీ యువకులు కాపీ కొట్టేందుకు దేనికైనా వెనకాడరని భయపడిన ఆర్మీ, ఓ చిత్రమైన పద్ధతిలో పరీక్షలను నిర్వహించింది. పరీక్షలో కాపీ కొట్టేందుకు ఎలాంటి చీటీలూ దాచుకునే అవకాశం లేకుండా, కేవలం లోదుస్తులతో పరీక్ష రాయమని పురమాయించింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... వందలాది మంది సిగ్గుతో చచ్చిపోతూ ఆర్మీ పరీక్షలను రాయవలసి వచ్చింది. సదరు పరీక్ష నిర్వహణ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆర్మీ విమర్శల పాలైంది. ఈ విషయమై పాట్నా హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలు కావడంతో, రక్షణ శాఖకు సైతం తలవంపులుగా మారింది. దాంతో రక్షణ మంత్రి మనోమర్ పరికర్ స్వయంగా రంగంలోకి దిగి, ఘటనకు సంబంధించి పూర్తి నివేదికకు ఆదేశించారు. పరీక్షని నిర్వహించిన ఆర్మీ అధికారులు మాత్రం, అభ్యర్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకే ఇలాంటి వినూత్న పద్ధతిలో పరీక్షను నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. పద్ధతి వినూత్నంగానే ఉన్నా, అది ఎవరికీ నచ్చినట్లు లేదు!


