బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మజ్లీస్ మార్క్ రాజకీయాలు షురూ

 

మరొక ఐదు రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కనుక రాజకీయ పార్టీల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. కనుక అన్ని పార్టీలు ప్రజల భావోద్వేగాలతో తెగ ఆడేసుకొంటున్నాయి. ఇంతవరకు హైదరాబాద్ పాత బస్తీకే పరిమితమయిన మజ్లీస్ పార్టీ మొట్ట మొదటిసారిగా బీహార్ లో అడుగు పెడుతోంది. సహజంగానే అది ముస్లిం ప్రజలందరినీ తనవైపు తిప్పుకొనేందుకు ఏమేమీ చేయవచ్చునో అవన్నీ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో దాద్రి అనే ప్రాంతంలో ఆవుదూడను చంపి దాని మాంసం తిన్నాడనే అనుమానంతో మొహమ్మద్ ఇఖ్ లఖ్ అనే వ్యక్తిని కొంతమంది కొట్టి చంపారు. అటువంటి సంఘటనలు జరగడం చాలా విచారకరం. ఆ నేరానికి పాల్పడిన వారిని కటినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే. చట్టపరంగా చేపట్టవలసిన చర్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ బీహార్ లో అన్ని పార్టీలు దానిని ఒక రాజకీయ అస్త్రంగా మలుచుకొని ఎన్నికలలో లబ్ది పొందేందుకు తెగ ప్రయాసపడుతున్నాయి. బీహార్ లో మొదటిసారి అడుగుపెడుతున్న మజ్లీస్ పార్టీకి అది ఊహించని ఒక గొప్ప ఆయుధంగా అందివచ్చింది.

 

ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తోంది. దానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ అధినేత. ఇంతవరకు ముస్లిం ప్రజలకు తానే శ్రేయోభిలాషి అన్నట్లుగా వ్యవహరిస్తూ తనను తాను ములాయం ఖాన్ అని గొప్పగా చెప్పుకొంటూ ముస్లింల ఓట్లను కొల్లగొడుతున్నారు. కనుక ఆయననే మజ్లీస్ తన ప్రధాన ప్రత్యర్ధిగా భావించడం సహజం. కనుక అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సమాజ్ వాదీ పార్టీపై ఓవైసీ సోదరులు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం ముస్లిం ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంది. పైగా ఆ పార్టీకే చెందిన ఆజం ఖాన్ అనే మంత్రి ఈ సంఘటనపై ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని గొప్పగా చెప్పుకోవడం మరీ సిగ్గుచేటు. అంటే ఆయనకి తమ ప్రభుత్వంపైన, కేంద్రప్రభుత్వం మీద నమ్మకం లేదని అర్ధం అవుతోంది. ఈ సమస్య మన దేశ అంతర్గత సమస్య. దేశంలో ముస్లింల పోరాటం రాజకీయ పార్టీలతో, ప్రభుత్వాలతోనే కానీ దేశంతో కాదు. ఈ సమస్య గురించి ఐక్యరాజ్యసమితికి పిర్యాదు చేస్తానని అజాం ఖాన్ చెపుతుంటే ఆ పార్టీకి చెందిన నేతలెవరూ ఖండించడం లేదు. ఆయన మాటలను ములాయం సింగ్ సమర్దిస్తారో లేదో చెపితే బాగుంటుంది. ఒకవేళ మంత్రి మాటలను ఆయన సమర్దిస్తున్నట్లయితే తక్షణమే అధికారంలో నుండి దిగిపోయి, తమ ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఆయనే కేంద్రాన్ని కోరాలి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించలేనప్పుడు తక్షణమే అధికారంలో నుండి దిగిపోవడం మంచిది. కేంద్రప్రభుత్వం అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి."

 

"బీహార్ లో ముస్లింల పరిస్థితి కూడా ఏమీ గొప్పగా లేదు. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో పూర్ణియా చాలా వెనుకబడి ఉంది. కానీ అక్కడి ప్రజలకు త్రాగునీరు, విద్యా, వైద్యం, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడం గురించి మాట్లాడకుండా రాజకీయ పార్టీలన్నీ గోవధపై నిషేధం విదించాలా వద్దా? అని చర్చిస్తున్నాయి. ఆశా భోస్లే కుమారుడు చనిపోగానే ట్వీటర్లో సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ, మొహమ్మద్ ఇఖ్ లఖ్ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి వెనకాడుతున్నారు. ప్రపంచంలో అన్ని సమస్యల గురించి అనర్ఘళంగా మాట్లాడే నరేంద్ర మోడి దాద్రీ సంఘటనపై మాత్రం నోరు విప్పి మాట్లాడటం లేదు,” అని అన్నారు.

 

ఒక మంత్రి అవివేకంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడితే బోడి గుండుకీ మోకాలుకీ ముడేస్తునట్లు ఆ మాటలను పట్టుకొని బీహార్ ఎన్నికలలో లబ్ది పొందాలని అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారు. తమకేదో గొప్ప దేశభక్తి ఉన్నట్లు మాట్లాడుతున్న ఓవైసీ సోదరులు బీహార్ లో అడుగు పెట్టగానే అక్కడి ముస్లిం ప్రజలను ఆకట్టుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టె విధంగా ప్రసంగాలు చేసారు. అందుకు అక్బరుద్దీన్ ఓవైసీపై పోలీసులు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసారు.

 

పూర్ణియాలో ముస్లిం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి మాట్లాడకుండా రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు పొందేందుకు గోవధ నిషేధం గురించి మాట్లాడుతున్నాయని ఒవైసీ సోదరులు విమర్శిస్తున్నారు. కానీ వారు కూడా భిన్నంగా వ్యవహరిస్తున్నారా? అంటే లేదనే స్పష్టం అవుతోంది. ఆటువంటప్పుడు ఇతరులను నిందించడం దేనికి? బీహార్ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ లో కూర్చొని బీహార్, ఉత్తరప్రదేశ్ లో ముస్లిం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నవారు రేపు ఎన్నికలలో గెలిస్తే మాత్రం అక్కడి ముస్లిం ప్రజలకు మేలు చేస్తారని నమ్మకం ఏమిటి? అని బీహార్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉంది.