లాలూ ప్రసాద్ సలహాలు మాకు అవసరం లేదు: జెడియు

 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో సవాలు విసురుతున్న ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బద్ద విరోధి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి మళ్ళీ అధికారం చేజిక్కించుకోగలిగారు. కానీ అప్పుడే ఆయనకు లాలూతో సమస్యలు మొదలయినట్లున్నాయి. కొడుకులిద్దరూ మంత్రులు కావడంతో లాలూ కూడా ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెడుతున్నారు.

 

బిహార్ లో రూ.750 కోట్ల వ్యయంతో ఒక భారీ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టుని బి.ఎస్.సి.& సి.సి. అనే రెండు ప్రైవేట్ సంస్థలు దక్కించుకొన్నాయి. అందులో 10 శాతం వాటా అంటే రూ.75 కోట్లు ఇమ్మని సంతోష్ ఝా అనే ఒక గూండా ఆ సంస్థలను డిమాండ్ చేస్తున్నాడు. ఆ సంస్థలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు ఇంజనీర్లను ఆ గూండా కోసం పనిచేస్తున్న ముఖేష్ పాఠక్ అనే షూటర్ గత శనివారం దర్బంగా జిల్లాలో హత్య చేసాడు. తక్షణమే పోలీసులు రంగంలోకి దిగి సంతోష్ ఝా, అతని అనుచరులను అరెస్ట్ చేసారు. ముఖేష్ పాఠక్ ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడు.

 

ఆ సంఘటనపై స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్, “ఆ ఇంజనీర్ల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ బాధిత కుటుంబాలు తమకు న్యాయం జరుగకపోతే వారు నేరుగా నన్ను సంప్రదించవచ్చును. ఇంతకు ముందు రణవీర్ సేన అధినేత హత్య జరిగిన తరువాత నుండి రాష్ట్ర పోలీసులు మనోధైర్యం కోల్పోయినట్లున్నారు. అందుకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతలు) ఆందోళనకరంగా మారుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి,” అని లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో అన్నారు.

 

గత పదేళ్లుగా హోం శాఖను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన వద్దే అట్టేబెట్టుకొని స్వయంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను అదుపులో ఉంచుతున్నారు. ఇప్పుడు కూడా హోం శాఖ ఆయనే అట్టేపెట్టుకొన్నారు. కనుక లాలూ చేసిన ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఉద్దేశ్యించి చేసినవిగానే అధికార జెడి(యు) పార్టీ భావించి లాలూకి ఘాటుగా జవాబు చెప్పింది.

 

రాష్ట్ర జెడి(యు) అధ్యక్షుడు వశిష్ట్ నారాయణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ “నితీష్ కుమార్ ప్రభుత్వం చాలా మంచి పరిపాలన చేస్తోందని భావించబట్టే ప్రజలు ఆయనకీ మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం చాలా సమర్ధంగా వ్యవహరిస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కనుక ఆ విషయంలో ముఖ్యమంత్రికి ఎవరూ ఎటువంటి సలహాలు ఇవ్వనసరం లేదు,” అని ఘాటుగా జవాబిచ్చారు.