నితీష్… నీతిమంతుడుగా కనిపించటమే ఆయన ‘వ్యూహం’!

 

దశాబ్దాల పాటూ ముఖ్యమంత్రులుగా కొనసాగిన వారు కూడా తమ జీవితంలో ఆరు సార్లు ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చు! కానీ, నితీష్ చేశాడు! ఒకే ఒక్క బీహార్ రాష్ట్రానికి ఆయన గత 17ఏళ్లలో ఆరు సార్లు సీఎం అయ్యాడు! తనకు కష్టం వచ్చినా రాజీనామా చేస్తాడు, ఇష్టం లేకపోయినా రాజీనామా చేస్తాడు… అసలు సిసలు భారతీయ లౌకిక రాజకీయ నేత అంటే ఏంటో తేల్చి చూపిస్తాడు! ఇదీ నితీష్ వ్యవహారం!

 

రెండేళ్ల కింద మహాఘట్భందన్ పేర నితీష్ బీజేపిని అధికారానికి దూరంగా వుంచినప్పుడు దేశంలో ఎవరెవరు సంతోషించారో… గాల్లో తేలిపోయారో… వారంతా ఇప్పుడు లోలోన కాలిపోతున్నారు! కాని, బీహార్ ఎన్నికల ఫలితాల సమయంలో నిలువునా కూలిపోయిన కమలం అభిమానులు ఇప్పుడు ఎగిరి గంతులేస్తున్నారు! కాని, ఆశ్చర్యం ఏంటంటే… అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నితీష్ కే లాభం! ఆయన సీఎం పదవి పదిలం! బద్ధ శ్రతువులైన బీజేపి, కాంగ్రెస్ లతో సహా ఆర్జేడీ లాంటి ఆజన్మ శత్రువును కూడా ఆయన తన రాజకీయంలో భాగంగా ఇష్టానుసారం వాడుకున్నాడు! అంతే కాదు, మోదీని వ్యతిరేకించే పొలిటీషన్స్ కాకుండా ఇతర మేధావులు, రచయితలు, కవులు, ఆఖరుకు మీడియా, బాలీవుడ్ వారు కూడా నితీష్ లో భవిష్యత్ ప్రధానిని చూశారు! ఇప్పుడు… అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది! ఇది ఖచ్చితంగా నితీస్ రాజకీయ చాణక్యమే!

 

అసలు పోయిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ లాలూతో కలవటమే పెద్ద అనుమానాస్పద పరిణామం! ఎందుకంటే, పాట్నా రాజకీయాల్లో బీజేపి, కాంగ్రెస్ పెద్ద ప్రధానం కాదు. ప్రాంతాయ పార్టీలైన లాలూ ఆర్జేడీ, నితీష్ జేడీయూనే కీలకం. ఆ రెండు పార్టీలే బీహార్ ను ఏలుతూ వస్తున్నాయి.

 

హస్తం, కమలం ఎప్పుడూ భాగస్వామ్య పక్షాలే! అయినా కూడా నితీష్ అన్ని రూల్సు బ్రేక్ చేసి లాలూతో అంటకాగాడు. తాత్కాలికంగా లబ్ధి పొంది సీఎం అయ్యాడు. కాని, మద్యసాన నిషేధం అనే నితీష్, మద్యం వ్యాపారం చేసే వారి అండతోనే పార్టీ నడిపే లాలూ ఇంత కాలం కలిసి వుండటం కూడా ఆశ్చర్యమే! చివరకు, యాదవ యువరాజు తేజస్వీ అవినీతి కారణంతో రోడ్డున పడింది గట్భంధన్! బంధం అవినీతి కత్తి పీట మీద అడ్డంగా తెగిపోయింది! తేజస్వీ, లాలూల అవినీతి, మొండితనం నితీష్ పద్మవ్యూహం నుంచి బయటపడే పుష్కలమైన అవకాశం ఇచ్చింది!

 

ఇప్పటికిప్పుడు బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకి వెళితే బీజేపి ఒంటరిగా అధికారం చేజిక్కించుకునే అవకాశాలు తక్కువే. అందుకే ఆ రిస్క్ తీసుకోకుండా కమలం నితీష్ బాబుతో చేతులు కలిపింది. అలా లాలూని, కాంగ్రెస్ ని ఏక కాలంలో దెబ్బ కొట్టింది. నితీష్ రూపంలో ఎన్డీఏలోకి మరో సీనియర్, సెక్యులర్ నాయకుడ్ని ఆహ్వానించింది. జేడీయు బలంతో రాజ్యసభ మరింత తేలిక కానుంది మోదీకి! ఇలా ఇప్పుడు నితీష్, మోదీ ఇద్దరూ లాభపడ్డారు. తీవ్రంగా నష్ట పోయింది మొండికేసిన లాలూ! ఆయననే నమ్ముకున్న కాంగ్రెస్!

 

ఇక నితీష్ రాజీనామా మరో ఎఫెక్ట్… 2019లో ఎంతో కొంత పోరాడి ఓడదామని భావించిన ప్రతిపక్షం ఇప్పుడు కుడిదిలో పడిపోయింది! కాంగ్రెస్ నడిపే యూపీఏకి, నిజంగా ఎప్పుడూ లేనే లేని ధర్డ్ ఫ్రంట్ కి, అన్నిటికీ నితీషే ఇంత కాలం ఆశదీపంగా మిణుమిణుమన్నాడు! కాని, ఎన్డీఏలో చేరిన ఆయన మోదీ వ్యతిరేక బ్యాచ్ మొత్తాన్ని చీకట్లో నెట్టాడు. 2019లో వారు ఇప్పుడు చీకట్లోనే తచ్చాడుతూ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి!