రాజ్యసభ రేసులో హేమాహేమీలు.. ఆ పెద్దలు ఎవరో?
Published on: Fri Apr 1, 2022 4:48PM
.webp)
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండి పోతున్నాయి. అంతకంటే ఎక్కువగా రాజకీయాలు భుగభుగ మంటున్నాయి. అక్కడా, ఇక్కడా కూడా మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది.ఇప్పుడు ఆ వేడికి తోడు ఏపీలో నాలుగు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రానున్న రెండు నెలల్లో ఈ స్థానాలకు ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి రిటైర్ అవుతున్న ఏడుగురు సభ్యులతో పాటుగా దేశ వ్యాప్తంగా రానున్న నెలలలో రిటైరయ్యే మొత్తం 72 మంది సభ్యులకు రాజ్యసభ వీడ్కోలు పలికింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సభ్యుల సేవలను మేచ్చుకోవడంతో పాటుగా, రిటైర్ అయిన సభ్యులు తిరిగి ఎన్నికై రావాలని ఆకాంక్షించారు. అయితే, ఇతర రాష్ట్రాల సభ్యుల సంగతేమో కానీ, తెలుగు రాష్ట్రాల నుంచి తిరిగి వెళ్ళేవారు, ఇంచుమించుగా లేరనే అనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేస్తున్నా వారిలో ఏపీ నుంచి సుజనా చౌదరి, విజయసాయిరెడ్డి, టిజి వెంకటేష్, సురేష్ ప్రభు ఉన్నారు. అయితే ఈ నలుగురిలో విజయసాయి మినహా మిగిలిన ముగ్గురిలో ఇద్దరు గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, ఆ పార్టీ తరపున గెలిచి తర్వాత బీజేపీలో చేరారు. సురేష్ ప్రభు కూడా టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లతోనే బీజేపీ అభ్యర్దిగా గెలిచారు.విజయసాయి, ఒక్కరే వైసీపీ తరుపునే గెలిచారు. అయితే రేపటి ఎన్నికల్లో, తెలుగు దేశం, బీజేపీ అభ్యర్ధులుగా గెలిచిన ముగ్గురూ మళ్ళీ గెలిచే అవకాశమే లేదు. తెలుగు దేశం పార్టీకి అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో ఒక్క అభ్యర్ధి కూడా గెలిచే అవకాశం లేదు.
మరో వంక నాలుగు సీట్లు వైసేపీనే గెలుచుకునే అవకాశం ఉన్నా, విజయసాయికి మళ్ళీ అవకాశం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య దూరం పెరిగిన నేపధ్యంలో జగన్ రెడ్డి ఆయనకు మళ్ళీ అవకాశం ఇవ్వరని అంటున్నారు. అందుకే ముందుగానే ఆయనకుపార్టీ అనుబంద సంఘాల బాధ్యతలు అప్పగించి పార్టీ కార్యాలయానికి కట్టిపడేశారని, ఇక సాయి రెడ్డికి మళ్ళీ పెద్దల సభలో ప్రవేశించడం, ఢిల్లీలో చక్రం తిప్పడం అయ్యే పని కాదని అంటునారు.
ఇక జగన్ రెడ్డి ఎవరికీ అవకాశం కల్పిస్తారు అనే విషయంలో జోరుగా చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ, ఎవరు ఏమిటి అనే విషయం మాత్రం రూఢీ కాలేదు. గతంలో అంబానీలకు ఒక సీటు ఇచ్చిన జగన్ రెడ్డి ,ఈ సరి మరో పారిశ్రమిక దిగ్గజం ఆదానీకి ఒక సీటు ఖాయమని అంటునారు. మిగిలిన మూడు సీట్ల కోసం చాల గట్టిపోటీ ఉంది. రాజ్యసభ సీట్ల కోసం నేతలంతా ఆశగా చూస్తున్నారు.ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు ఎవరూ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈసారి రాజ్యసభ ఎన్నికలో కొత్త ముఖాలు కనిపిస్తాయని ఏపీ రాజకీయ వర్గాల సమాచారం.
ఇందులో మెగా స్టార్ చిరంజీవి మొదలు కమేడియన్ అలీ వరకు, బంధు వర్గం నుంచి ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి మొదలు వైవీ సుబ్బారెడ్డివరకు చాల మంది పేర్లు ప్రచారంలో అయితే ఉన్నాయి కానీ,అయితే ఇందు ఒక్క ఆళ్ల మినహా మిగిలిన అందరి పేర్లను జగన్ రెడ్డి ఇప్పటికే రైట్ ఆఫ్ చేసినట్లు సమాచారం. అదే విధంగా ఇటీవల చనిపోయిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అలాగే, గౌతం రెడ్డి సతీమణి కీర్తి రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేపక్షంలో, అదే కుటుంబంలో మరొకరిని రాజ్యసభకు పంపాక్ పోవచ్చని అంటున్నారు.ఆలాగే మరో జాబితాలో కిల్లి కృపారాణి సహా పలువరు ఆశావహులుగా ఉన్నట్టు సమాచారం. అలాగే, ఒక సీటు బీజేపీకి కేటాయించాల్సిందిగా అమిత్ షా.. సీఎం జగన్ ను అడిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ నిజంగానే అమిత్ షా అడిగి ఉంటే జగన్ కాదంటారా? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక తెలంగాణ విషయానికి, వస్తే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వచ్చే జూన్ నాటికి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్, బండ ప్రకాష్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్‌లో రాజ్యసభ సీటు కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ తనకు ఉపయోగపడే నేతలను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడం కేసీఆర్‌కు కత్తిమీద సాములా మారింది. ఎవరికి రాజ్యసభ సీటు కట్టబెట్టినా మిగతా వారు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. పార్టీలో సుమారు 10మంది వరకు రాజ్యసభ స్థానం ఆశిస్తున్నారు. ఇందులో కొందరు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులతో పాటు గతంలో రాజ్యసభ రాజ్యసభ స్థానం ఇస్తామని హామీ ఇచ్చిన వారు ఉన్నారు. వీరంతా ఇప్పుడు తమకు రాజ్యసభ ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీఎస్‌లకు మళ్లీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఉప ఎన్నికతో భర్తీ చేయక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, వేణుగోపాలచారి, జూపల్లి కృష్ణారావు, మంద జగన్నాధంలు రాజ్యసభ ఆశిస్తున్నా... అవకాశం ఇస్తారా లేదా అనే ఉత్కంఠ సాగుతోంది కేసీఆర్ ముంబై పర్యటనలో హడావుడి చేసిన నటుడు ప్రకాష్ రాజ్ పేరు కారు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీతో సంబంధం లేని ప్రకాష్ రాజ్ జాతీయ స్థాయిలో పనికి వస్తారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఇటు ఎమ్మెల్సీగా ఉన్న కవితను రాజ్య సభ ఎంపీగా పంపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీలోకి వెళ్లిన వివేక్ వెంకటస్వామికి గులాబీ కండువా కప్పి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.


