పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం
Published on: Sat May 30, 2026 12:28PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత నాలుగు నెలలుగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి ఇప్పటివరకు సుమారు 20 పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా పోలవరం జిల్లాలోని గంగవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
శుక్రవారం ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతం, ఆర్.డి. పురం పరిసరాల్లో పులి సంచరించిన ఆనవాళ్లు లభించాయి. పులి కదలి కలతో గంగవరం మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పశువులపై వరుస దాడులు జరగడంతో రైతులు, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. సాయంత్రం తర్వాత బయటకు వెళ్లేందుకు కూడా ప్రజలు వెనుకాడుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వేములోవ, పిడతమామిడి తదితర గ్రామాల్లో పర్య టించి పరిస్థితిని సమీక్షిం చారు. గ్రామస్తులతో సమావేశమై తగు జాగ్రత్తలు సూచించారు. ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, పులి ఆనవాళ్లు కనిపించిన వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పెద్దపులి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు, దాని సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తు న్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు... గత నాలుగు నెలలుగా అడవి ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలలో సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ జీవించసాగారు.


