TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

షర్మిలకు ఊహించ‌ని షాక్‌.. పార్టీ ఉంటుందా? ఊడుతుందా?

Published on: Thu Jan 13, 2022 10:26AM

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఊహించని మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె పార్టీ రిజిస్ట్రేషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే అన్న వైయస్ఆర్  పేరుతో ఓ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో తన పార్టీ.. వైయస్ షర్మిల స్థాపించిన పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయని.. అన్న వైయస్ఆర్ పార్టీ వారు.. కేంద్ర ఎన్నికల సంఘానికి గతేడాది నవంబర్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు లేఖ రాసినట్లు సమాచారం. 

దీనికీ వైయస్ షర్మిల ఏమని బదులిస్తారు.. ఆమె ఇచ్చే జవాబుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనేది ప్రస్తుతం తెలుగు ప్రజల్లో ఓ ఆసక్తిని అయితే రేపుతోంది. ఎందుకంటే.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ.. వైయస్ఆర్ తెలంగాణ పార్టీని వైయస్ షర్మిల స్థాపించారు. ఆ క్రమంలో ఆమె.. రైతుల కోసం, నిరుద్యోగుల కోసం వరుస దీక్షలు చేపట్టడంతోపాటు ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, నిరుద్యోగుల కుటుంబాలను సైతం ఆమె పరామర్శిస్తున్నారు. అంతేకాదు.. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆమె పాదయాత్రకు సైతం శ్రీకారం చుట్టారు. 

అయితే ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ఆమె పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత కరోనా విజృంభించింది. దీంతో ఆమె మళ్లీ పాదయాత్రను ప్రారంభించలేదు. కానీ ఆమె పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టేశారనే టాక్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 

తెలంగాణలో వైయస్ఆర్ టీపీ గెలుపు కోసం ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌తో వైయస్ షర్మిల గతంలో ఒప్పందం చేసుకున్నారని.. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో.. తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోయిందని.. దీంతో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌తో ఓ ఒప్పందం చేసుకున్నారని సమాచారం. 

ఈ నేపథ్యంలో గతంలో వైయస్ షర్మిలతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రశాంత్ కిషోర్ రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా.. తెలంగాణలో పార్టీని మూసివేయాలని కూడా వైయస్ షర్మిలకు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్ర్రప్రదేశ్‌లో పార్టీని స్థాపిస్తారా? అని విలేకర్ల అడిగిన ప్రశ్నకు.. ఎక్కడైనా పార్టీని స్థాపించవచ్చు.. స్థాపించకూడదనే రూల్ ఏమైనా ఉందా అంటూ ఆమె... విలేకర్లకు ఆమె ఎదురు ప్రశ్న వేశారు. వైయస్ షర్మిల చేసిన ఈ కామెంట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద చర్చకు తెర తీసింది.  

కానీ వైయస్ షర్మిల.... పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆమెకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయన్నది మాత్రం సుస్పష్టం. ఆమె చేపట్టే దీక్షలకు, పాదయాత్రలకు మీడియా అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. దీంతో ఆమె ఎంత కష్ట పడినా.. ప్రజల్లో ఆమెకు అంతగా మైలేజ్ రావడం లేదని.. ఇంకోవైపు .. తన సోదరుడు, ఏపీ సీఎం వైయస్ జగన్‌తో ఏర్పడిన మనస్పర్థలు.. ఈ నేపథ్యంలో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వైయస్ షర్మిల దీర్ఘాలోచనలో పడినట్లు లోటస్ పాండ్‌లో ఓ టాక్ అయితే వైరల్ అవుతోంది.