TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూపీలో బీజేపీకి బిగ్ షాక్.. మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌..

Published on: Wed Jan 12, 2022 11:08AM

మరో రెండేళ్లలో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్’గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కేంద్రంలో వరసగా మూడవసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఆశల పందిళ్ళు వేస్తున్న, భారతీయ జనతా పార్టీకి, పార్టీని అధికార అందలం ఎక్కించిన యూపీలోనే  గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 

యూపీలో అగ్గి రాజుకుంది. ఇంతవరకు నివురుగప్పిన నిప్పులా దాగున్న, అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, వ్యవహార సరళి విషయంలో ఎంతో కాలంగా అసంతృప్తితో ఉన్న కార్మిక శాఖ మంత్రి స్వామిప్రసాద్‌ మౌర్య  ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. కాగా మౌర్య రాజీనామాతో బీజేపీ విజయావకాశాలు గణనీయంగా దెబ్బ తింటాయని ఆ పార్టీ  నాయకులే ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.  అంతేకాదు, మౌర్య పోతూ పోతూ, బీజేపీలో దళిత బహుజనలకు, ఓబీసీలకు ఇతర వర్గాలకు  అవమానలే తప్ప ఆదరణ లేదని బాంబు పేల్చి వెళ్ళారు. ఒక  విధంగా పార్టీని డిఫెన్సులోకి నెట్టేశారు. ఆయన నేరుగా గవర్నర్’కు ఆనందీబెన్ పటేల్కు సమర్పించిన పంపిన రాజీనామా లేఖలో,“దళితులు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్నా-మధ్య తరగతి వ్యాపారులపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరే తన రాజీనామాకు కారణం” అని పేర్కొన్నారు. ఇప్పటికీ, బీసీలలో పట్టు సన్నగిల్లిన బీజేపీకి మౌర్య రాజీనామానే పెద్ద దెబ్బ అనుకుంటే, ఆయన ప్రయోగించిన బీసీ కార్డు, కమల దళాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతుందని అంటున్నారు. 

మౌర్య రాష్ట్రంలో సంఖ్యాపరంగా ఆధిక్యత, ఆధిపత్యంగల కుష్వా సామాజికవర్గానికి చెందిన ఓబీసీ నాయకుడు.  గతంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో నెంబర్ 2గా ఉన్న మౌర్య 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. పద్రౌన నియోజకవర్గం నుంచి ఐదు  సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మౌర్య ఇంచుమించుగా 20 నియోజక వర్గాల్లో ప్రభావం చూపగల గట్టి పట్టున ఓబీసీ నాయకుడు. 
అదలా ఉంటే మంత్రి పదవి వదులుకున్న స్వామిప్రసాద్ మౌర్య త్వరలో ఎస్పీలో చేరనున్నారు. మరోవైపు.. ఇంకో 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జోస్యం చెప్పారు.అంతే కాకుండా, రానున్న యూపీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కలిసి ఎన్సీపీ పోటీ చేస్తుందని, పవార్ ప్రకటించారు.ఇప్పటికే వమ పక్ష పార్టీలు కూడా ఎస్పీ పకి మద్దతు ప్రకటించాయి. 

నిజానికి, ఇలాంటి పరిణామాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం ముడుగానే పసి గట్టింది. అందుకే గతంలో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్’ను తప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్థాయిలో మంతనాలు జరిగాయి. అయితే యోగీ, కాషాయం కవచంగా ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. కాగా, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా, ఇప్పుడు బుజ్జగింపులు ప్రారంబించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య రంగంలోకి దిగి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని ట్వీట్ చేశారు. అయితే, స్వామిప్రసాద్ మౌర్య ఇప్పటికే ఆలస్యం జరిగిపోయిందని, ఇక సంప్రదింపులు చర్చలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. మరో వంక, ఆయన ఇంకా ఏ పార్టీలో చేరలేదని ఆయన కుమార్తె, బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య ట్వీట్  చేశారు. మరో రెండు రోజుల్లో తన తండ్రి తదుపరి కార్యచరణపై స్పష్టత వస్తుందన్నారు.

అయితే, మౌర్యతో పాటుగా, బయటకు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇప్పటికే బీజేపీకి గుడ్ బై చెప్పి ఎస్పీ తీర్ధం పుచ్చుకున్న ఇద్దరితో  పాటుగా 2017 ఎన్నికలకు ముందు బీఎస్పీనుంచి బీజేపీలోకి వచ్చిన 13 మంది ఎమ్మెల్యేలు, ఒకరి తర్వాత ఒకరు బీజేపీని వదిలి  ఎస్పీలో చేరడం ఖాయమని, అంటున్నారు. అంతే కాకుండా, ఇతర ఓబీసీ ఏమ్మేల్యేలు కూడ మౌర్య బాటలోకి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే, ఇప్పటికే పీకలలోతు కష్టాల్లో ఉన్న కమలదళం గంగలో మునిగినా ప్రయోజనం ఉండక పోవచ్చని అంటున్నారు,అయితే అంతిమంగా ఏమి జుగుతుంది అనేది, మార్చి 10న గానీ తేలదు.