కాంగ్రెస్ కు షాక్.. సీఎల్పీ విలీనం, ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా!!
Published on: Thu Jun 6, 2019 11:09AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాని కోల్పోనుందా? అధికార పార్టీ టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం కు ప్రతిపక్ష హోదా దక్కనుందా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో.. ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఉత్తమ్ రాజీనామా చేయడంతో మరొక ఎమ్మెల్యే టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే చాలు కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రెండు వంతులు తమ వైపు వస్తే.. లెక్క సరిపోతుందని ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ కు ఉత్తమ్ రాజీనామా కలిసొచ్చింది.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు హస్తం గుర్తుపై గెలిచారు. అయితే ఆ 19 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. 19 మందిలో 13 మంది అయితే కాంగ్రెస్ బలంలో మూడింట రెండొంతులవుతుంది. కానీ, తాజాగా ఉత్తమ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 18కి పడిపోయింది. ఇక 18 మంది ఎమ్మెల్యేల్లో రెండొంతులంటే 12 మంది. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు ఉండడంతో కావల్సింది ఇక ఒకే ఒక్కరు. ఆ ఒక్కరూ టీఆర్ఎస్ వైపు వస్తే.. అప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రక్రియకు మార్గం సుగమం అవుతుంది. ఇది జరిగితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. సభలో మొత్తం బలంలో పదో వంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120 మంది సభ్యులు ఉన్న సభలో.. కాంగ్రెస్ బలం ఆరుకు పడిపోతుంది. దీంతో వీరికంటే ఎక్కువగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


