రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. కీలక నేత జంప్!
Published on: Sat Nov 6, 2021 1:15PM
హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ రాకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. పీసీసీ నేతల తీరుపై సీనియర్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ వివాదం ఇలా ఉండగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగలబోతుందని తెలుస్తోంది. సీనియర్ నేత హస్తం పార్టీకి హ్యాండిచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారం గాంధీ భవన్ లో కాక రేపుతోంది.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఉమ్మడి జిల్లాలోని తన వర్గం నేతలతో భేటి కానున్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రేమ్ సాగర్‌రావు ప్రకటించనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావుకు భారీగా అనుచరణ గణం ఉంది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు.. ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కొంత సైలెంటుగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు రాగానే ఆయన కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి స్వయంగా ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లి మాట్లాడారు. దీంతో ఆయన కూల్ అయ్యారని భావించారు. తాజాగా ఆయన పార్టీ అనుచరులతో సమావేశం కానుండటంతో పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమంటున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు ఏ పార్టీలోకి వెళతారన్నది తేలడం లేదు. బీజేపీతో పాటు టీఆర్ఎస్ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.


