కమలం గూటికి ములాయం కోడలు.. ఫ్యామిలీలో కలకలం..
Published on: Mon Jan 17, 2022 11:46AM
రాజకీయ నాయకులు పార్టీలు మారడం పెద్ద విషయం ,విశేషం కాదు. అందులోనూ ఎన్నికల సమయంలో ఇటు వారు అటు,అటు వారు ఇటూ గోడ దూకడం సహజం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుతున్న ఉత్తర ప్రదేశ్’, పంజాబ్, గోవా , ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అదే జరుగుతోంది. ఉత్తర ప్రదేశ్'లో అయితే, అధికార బీజేపీ నుంచి ముగ్గురు మంత్రుల సహా ఓ అర డజను మంది వరకు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సమాజ్ వాదీ (ఎస్పీ) లో చేరారు. ఇంకొందరు అదే బాటలో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారి వల్లనే కావచ్చు ఆయారాం ... గయారాం అనే పదం రాజకీయ నిఘంటువులో ప్రముఖ స్థానం సంపాదించుకుంది.
అయితే ,సాధారణ ఫిరాయింపులు ముఖ్యంగా ఎన్నికల సమయంలో జరిగే ఫిరాయింపులకు జనం కూడా అలవాటు పడిపోయారు, కానీ, పార్టీ అగ్రనేతల కుటుంబంలో చీలికలు వస్తే మాత్రం అది వార్తే అవుతుంది. అందుకే కావచ్చును, బీజీపీ నుంచి వరస పెట్టి వరదలా మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలోకి చేరుతున్న వార్త కంటే, ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా సింగ్ బీజేపీలో చేరిన వార్త ప్రముఖంగా వార్తల్లో వినవస్తోంది. నిజానికి ములాయం చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అర్పనా సింగ్ ఇంకా కాషాయ తీర్ధం పుచ్చుకోలేదు, త్వరలో పుచ్చుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే సమాజ్ వాదీ పార్టీకి కొంతమేర ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆమె గతంలో 2017 లో ఉత్తర ప్రదేశ్’ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీ తరఫున పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అయితే, ఇటీవలి కాలంలోబీజేపీ ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ వస్తున్నారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం ఊపందుకుంది.
గత కొద్దిరోజులుగా కీలకమైన బీసీ నేతలు పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో.. అపర్ణా యాదవ్ చేరిక.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. ఎస్పీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలోని వ్యక్తి రావడం.. బీజేపీకి లాభించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.


