అయ్యో కాంగ్రెస్.. తెలంగాణలో ఎందుకిలా?

 

ఐదు రాష్ట్రాల ఫలితాలు మరి కొద్ది సేపట్లో తేలిపోనున్నాయి. ఇప్పటికే ఏయే రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలవబోతుందనే అవగాహన అయితే వచ్చింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఐదు రాష్ట్రాల ఫలితాలూ ఈరోజే తెలుస్తాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఆధిక్యం ఉండి.. అధికారం దిశగా దూసుకుపోతుంది. మరోవైపు మిజోరంలో కూడా కాంగ్రెస్ రెండో స్థానంతో పర్వాలేదు అనిపించుకుంటుంది. అయితే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో ఒంటరిగా 22 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి కూటమిగా ఏర్పడి కూడా కనీసం 20 స్థానాలైనా గెలుచుకుంటుందా అనిపిస్తోంది.

ఎన్నికల ముందు కాంగ్రెస్.. టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి ప్రజకూటమిగా ఏర్పడటంతో.. టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది అనుకున్నారు. కానీ పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. కూటమి టీఆర్ఎస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అధికారం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్ తెలంగాణలో కనీసం 20 సీట్లైనా గెలుస్తుందా అనిపిస్తోంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాల్సింది పోయి.. ఇలా చతికలు పడటానికి కారణం కూటమేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే అధికారంలోకి రాకపోయినా టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చేదేమో. కానీ కూటమిగా ఏర్పడి అధికారంపై కన్నేసిన కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. చివరి వరకు పొత్తులు, సీట్ల పంపకాలు తేలలేదు. చాలా మంది అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించారు.. దీంతో ప్రచారానికి సమయం సరిపోలేదు. అదీగాక కాంగ్రెస్ తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటూ టీఆర్ఎస్ జనాల్లోకి బాగా తీసుకెళ్లింది. ఇది కూడా ఒక రకంగా నష్టం కలిగించింది. ఇక కాంగ్రెస్, టీడీపీ మొన్నటి వరకు బద్ధ శత్రువులు. ఇలాంటి పార్టీలు కూటమితో దగ్గరైతే కొందరు ఆహ్వానించారు కానీ కొందరు కార్యకర్తలు వ్యతిరేకించారు. మరి ముఖ్యంగా వైఎస్ అభిమానులు కొందరు కాంగ్రెస్, టీడీపీ పొత్తుని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ కి వోట్ వేశారు. నిజానికి కూటమిలో చాలా పార్టీలు ఉన్నాయి కానీ బలమైన పార్టీలు ఒకటి రెండు మించి లేవు. కానీ కేసీఆర్ ఓడించడానికి అందరూ కలిశారు అనే అభిప్రాయం మాత్రం టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీకి కాస్త కలిసొచ్చే అంశమనే చెప్పాలి.