బీజేపీకి బిగ్ షాక్.. కనీసం ఆ సీటు గెలిస్తే పరువు దక్కేది

కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.

 

 

ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల అనంతరం రామనగర స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామం జేడీఎస్‌కు ఎంతగానో కలిసొచ్చింది. రామనగరంలో బీజేపీకి 15,906 మాత్రమే పోలయ్యాయి. లక్షా 9వేలకు పైగా భారీ మెజారిటీని అనితా కుమారస్వామి దక్కించుకోవడంతో జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 

జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిద్ధు కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  ఆనంద్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిచ్చింది. అయితే శివరామకు పోటీగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పొటీ ఏకపక్షమే అయ్యింది.

బీజేపీ కంచుకోట 'బళ్లారి'లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి శాంత బరిలోకి దిగారు. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కనీసం ఈ సీటు నిలుపుకుంటే బీజేపీ పరువు దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. మధుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఫలితాల్లో రాఘవేంద్ర, మధు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో మధు ఆధిక్యం కూడా కనబర్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన శివమొగ్గ ఉపఎన్నికలో చివరకు రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికలు ఫలితాలు బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.