జగన్ కట్టడికి విజయమ్మ!.. రంగంలోకి వైఎస్సార్ టీమ్!
Published on: Fri Feb 25, 2022 3:17PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసు కుంటున్నాయా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య తలెత్తిన విబేధాలు, కొత్త మలుపు తీసుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి అన్నా చెల్లీ మధ్య తలెత్తిన విబేధాల కారణంగానే షర్మిలా తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. అయినా, ఇద్దరి మధ్య దూరం తగ్గలేదు సరి కదా మరింతగా పెరిగింది. చివరకు తల్లి విజయమ్మతోనూ జగన్ రెడ్డి సంబంధాలు మునుపటిలా లేవు. తల్లీ కొడుకుల మధ్య దూరం బాగా పెరిగిందని కుటుంబ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.
అదలా ఉంటే, ఇంతవరకు, ‘వైఎస్సార్ ఫ్యామిలీ పాలిటిక్స్’ లో అంతగా వేలు పెట్ట్టని, ఒకప్పటి వైఎస్సార్ కుటుంబ మిత్రులు, రాజకీయ సన్నిహితులు, మచ్చలేని మనిషిగా ఎందరికో ఆత్మ బంధువుగా, అత్మీయ బందువుగా నిలిచిన వైఎస్సార్’ పేరుకు జగన్ రెడ్డి పాలన,, వ్యవహర సరళి కారణంగా చెడ్డ పేరు వస్తున్నకారణంగా ఇక జోక్యం చేసుకోక తప్పదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే, విజయమ్మ చొరవతో, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి, ‘ఆత్మ’ గా, ప్రాణానికి ప్రాణంగా మెలిగిన కేవీపీ రామచంద్ర రావు, ఉండవల్లి అరుణ కుమార్, రఘువీరా రెడ్డి, ఇంకా అనేక మంది, ఇటు కుటుంబపరంగా, అటు రాజకీయంగా వైఎస్సార్ పేరుకు కళంకం తెస్తున్న జగన్ రెడ్డికి రాజకీయంగా ‘చెక్’ పెట్టె ఆలోచనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలోచనకు విజయమ్మ ప్రధాన సూత్రదారిగా ఉండడం, ఆమె ప్రోద్బలంతోనే ఈ ప్రయత్నం జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘నమ్మలేని నిజం’గా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని తెలుస్తోంది.
నిజానికి, వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా, గత సంవత్సరం (2021) సెప్టెంబర్ 2, విజయమ్మ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగానే ఆమె తమ మనసులో మాటను కొందరి ముందు బయట పెట్టారని, ఇప్పుడు మళ్ళీ మరోసారి ఆమె కొందరు ముఖ్య నాయకులకు ఫోనేచేసి పరిస్థితి వివరింఛినట్లు సమాచారం. నిజానికి, కేవీపీ సహా వైఎస్సార్’ కు సన్నిహితంగా ఉన్న నేతలు ఎవరూ జగన్ రెడ్డి వెంట వెళ్ళలేదు. అందుకు ప్రధాన కారణం జగన్ రెడ్డి అవినీతి నైజం, ధనదాహం తెలుస కాబట్టే అటు వెళ్లలేదని అంటారు.
అదెలా ఉన్నా, ఇప్పడు వైఎస్సార్ ఇమేజ్’ని కాపాడేందుకు, అలనాటి మిత్రులు ఒక వేదికగా ఏర్పడి జగన్ రెడ్డి పరిపాలనా పపరంగా చేస్తున్న తప్పులు, వాటి దుష్పరిణామాలను ప్రజలకు వివరించాలని, నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నం మొదలైందని.. అయితే ఇది ఏ రూపంలో, ఎప్పుడు బయటకొస్తుంది, ఎలా రూపాంతరం చెందుతుంది అనేవిషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉందని అంటున్నారు.


