తెరాస సర్కార్ మొదటి స్కాం వెలుగులోకి..!!

'ఏ పార్టీ పాలించినా ఏమున్నది గర్వకారణం.. అంత స్కాముల మయం'. అన్నట్టుంది ప్రస్తుత రాజకీయాల పరిస్థితి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీమీద అవినీతి ఆరోపణలు రావడం, ఆ పార్టీ స్కాములు వెలుగులోకి రావడం కామన్ అయిపోయింది. దీనికి తెలంగాణలోని తెరాస పార్టీ కూడా అతీతం కాదు. ఇప్పటికే ప్రతిపక్షాలు తెరాస సర్కార్ అవినీతికి పాలపడిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడొక స్కాం వెలుగులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వేళ స్కాం మచ్చ తెరాసకు అంటుకుంటే ఆ పార్టీకి నష్టమనే చెప్పాలి. ఇంతకీ ఆ స్కాం ఏంటంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.వందల కోట్ల గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వేల సంఖ్యలో చెక్కులు మంజూరు చేశారు. వందల కోట్లు ఆ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నారు. కానీ వారు ఎవరు?.. వారికి ప్రభుత్వం ఏ కారణంగా సాయం చేసింది?.. లాంటి బేసిక్ వివరాలేమీ ప్రభుత్వం వద్ద లేవు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ స్కాం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. 2014 జూన్ నుంచి 2015 ఆగస్టు వరకు.. తెలంగాణ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 12,462 చెక్కులు మంజూరు చేసింది. ఈ చెక్కుల నుంచి రూ. 86.6 కోట్లను డ్రా చేసుకున్నారు. ఈ చెక్కులన్నీ ఎవరు తీసుకున్నారో కానీ.. కేవలం 182 చెక్కులకు సంబంధించిన సమాచారం మాత్రమే ప్రభుత్వం వద్ద ఉంది. మిగతా సొమ్ములు ఎవరికి ఇచ్చారో ప్రభుత్వానికే క్లారిటీ లేదని సమాచారం.

సాధారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే..  ప్రభుత్వ ఆరోగ్య పథకాల కిందకు రాని అరుదైన, ఖరీదైన వ్యాధుల బారిన పడిన వారికి ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అలాగే ఇతర సమస్యల్లో ఉన్న వారికీ ఈ నిధి నుంచి సాయం చేస్తారు. అయితే ఈ సాయం ఆషామాషీగా చేయడానికి ఉండదు. దానికో లెక్క ఉంటుంది. నేరుగా నిధులు ఇవ్వరు. ఏ ఆస్పత్రిలో చూపించుకుంటున్నారో వారికి మాత్రమే బిల్లు చెల్లిస్తారు. దానికీ ఓ ప్రాసెస్ ఉంటుంది. ప్రతీది రికార్డెడ్‌గా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం ఎవరికి సాయం చేశారో తెలియకుండానే నిధులు మంజూరు చేసేశారు. కొద్ది రోజుల క్రితం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. 46 నెలల్లో లక్షా ఇరవై వేల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేశామని.. ఇందు కోసం రూ. 800 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం జరిగింది. పేదల్ని ఆదుకున్నారని అభినందించారు. అయితే ఇప్పుడు అసలు ఇలా మంజూరు చేసిన సాయం ఎవరికి పోయిందో తెలియకుండా పోవడంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ సొమ్మంతా ఎటు పోయిందో తేల్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలు ఈ స్కాంను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్ము అంతా సీఎం ఆఫీస్ సాక్షిగా కాజేశారని ఆరోపణలు చేస్తూ.. దీనిపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ప్రభుత్వం తరపున విడుదలయ్యే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. కానీ కొన్ని వందల కోట్లకు.. అదీ నేరుగా సీఎంకి సంబంధం ఉన్న నిధులకు లెక్కలు లేకపోవడం.. ఎన్నికలకు ముందు చాలా పెద్ద వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఈ ఆరోపణల్లో నిజమెంత ఉందో?.. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో?.