విభజన ప్రక్రియకు బ్రేకులేసిన ఆ ముగ్గురు

 

నిన్న మొన్నటి వరకు తెలంగాణపై వెనకడుగు వేసే ప్రశ్నే లేదని డంకా బజాయించి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు, అఖిలపక్ష కమిటీ అంటూ రాష్ట్ర విభజనపై సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందువరకు చాలా ప్రశాంతంగా ఉన్న సీమంద్ర ప్రాంతం నేడు సమైక్య ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. అయితే, గత ఐదారేళ్ళుగా తెలంగాణా ఉద్యమాలకి అలవాటుపడిపోయిన కాంగ్రెస్ అధిష్టానం, ఈ సీమాంధ్ర ఉద్యమం చూసి భయపడే అవకాశం లేదు. అంటే వీటికంటే బలమయిన కారణమేదో దానిని రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేలా చేస్తోందని అర్ధం అవుతోంది.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ మాట్లాడటం మొదటి ప్రమాద హెచ్చరికగా భావించవచ్చును. ఆయన లేవనెత్తిన నీళ్ళు, ఉద్యోగాలు, విద్యుత్, రాజధాని తదితర అంశాలను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మొండిగా ముందుకుసాగినట్లయితే రెండు ప్రాంతాల ప్రజల మధ్య యుద్ధాలు ఎలాగు తప్పవు, ఆకారణంగానే రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన పరోక్షంగా చేసిన హెచ్చరిక కాంగ్రెస్ అధిష్టానంపై బాగానే పనిచేసినట్లుంది.

 

ఇక, రాష్ట్ర విభజనను మొదటి నుండి గట్టిగా వ్యతిరేఖిస్తున్న గవర్నర్ నరసింహన్ లేవనెత్తిన రాష్ట్రం విడిపోతే తెలంగాణాలో పెరగనున్న నక్సల్స్ సమస్య, రాజధానిలో శాంతి భద్రతల సమస్య తదితర అంశాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని పునరాలోచనలో పడేసి ఉండవచ్చును. ఈ అంశాలపై ముందే చాలా చర్చలు జరిగినప్పటికీ, ప్రస్తుతం హైదరాబాదులో ఆంద్ర తెలంగాణా ప్రభుత్వోద్యోగుల మధ్య నిత్యం జరుగుతున్నఘర్షణలు, అవి నగరంలో ఇతర వర్గాలకు ప్రాంతాలకు వ్యాపించే ప్రమాద హెచ్చరికలు వగైరాలు గవర్నర్ ముఖ్యమంత్రి వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.

 

ఇక పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ అధిష్టానానికి వ్రాసిన లేఖపై ముఖ్యమంత్రితో బాటు ఆయన కూడా సంతకం చేయడం గమనార్హం. ఒకవేళ తన రాజకీయ భవిష్యత్త్ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆయన కూడా అందుకు అనుగుణంగానే అభిప్రాయలు మార్చుకోవచ్చునని ఇది సూచిస్తోంది.

 

ఈవిధంగా రాష్ట్రానికి పెద్ద తలకాయలయిన గవర్నర్, ముఖ్యమంత్రి మరియు పీసీసీ అధ్యక్షుడు విభజనను గట్టిగా వ్యతిరేఖిస్తుండటం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదు. వారి సహకారం లేనిదే విభజన ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్ళడం కూడా చాల కష్టమని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకపోలేదు. అదేవిధంగా వారి హెచ్చరికలను, అభిప్రాయాలను బేఖాతరు చేసి ముందుకు సాగడం కూడా చాలా ప్రమాదం అని అర్ధం చేసుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి ముందు నుయ్యి గొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.

 

సమస్యను సృష్టించడం, నాన్చడం తప్ప ఎన్నడూ సమర్ధంగా పరిష్కరించడం చేతకాని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అందుకే కమిటీలు, చర్చలు అంటూ కొత్త పల్లవి పాడుతుంటే, టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస, టీ-జేయేసీ నేతలు అనుమానంగా చూస్తున్నారు.