లాభనష్టాలు!

 

భూటాన్ దేశంలో మిమి అనే పేద రైతు ఉండేవాడు. అవడానికి పేదవాడే అయినా తనకి ఉన్నదాంతో తృప్తి చెందేవాడు మిమి. ఎప్పుడు చూసినా సంతోషంగా, సంతృప్తిగా కనిపించేవాడు. అలాంటి మిమి ఓరోజు ఎప్పటిలాగే తన పొలంలో పని చేసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ పొలం చివర ఉండే ఓ ఎండిపోయిన మానుని చూడగానే, మిమికి కాస్త చిరాకు కలిగింది. ఇవాళ ఈ మానుని ఎలాగైనా సరే పీకిపారేయాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన గొడ్డలితో దాని మీద ప్రతాపమంతా చూపించడం మొదలుపెట్టాడు. ఆ రోజంతా మిమి ఆ మానుని పీకిపారేయాలనే తపనతో పనిచేశాడు. సాయంత్రం వేళకి అనుకున్నది సాధించాడు. ఆ మానుని కూకటివేళ్లతో సహా పెకిలించివేశాడు. కానీ ఆ గుంతలో చూసిన మిమి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. అక్కడ అతనికి ఒక పెద్ద పగడం కనిపించింది. సంతోషంగా ఆ పగడాన్ని తీసుకుని బయల్దేరాడు మిమి.

 

మిమి ఆ పగడాన్ని అమ్ముకుని వద్దామని అలా పట్నం వైపుగా సాగాడో లేదో... దారిలో ఒక గుర్రాన్ని ఎక్కి వస్తున్న భూస్వామి కనిపించాడు. ‘ఏమోయ్‌ మిమి! ఇంత సాయంత్రం వేళ పట్నానికి బయల్దేరుతున్నావేంటి?’ అని అడిగాడు భూస్వామి. మిమి జరిగిందంతా చెప్పి- ‘పట్నం దాకా ఎందుకు! మీ గుర్రాన్ని కనుక నాకు ఇస్తే, బదులుగా ఈ పగడాన్ని మీకు ఇచ్చేందుకు సిద్ధం!’ అనేశాడు.

 

మిమి ప్రతిపాదనకు భూస్వామికి మతిపోయింది. ఇంత లాభసాటి బేరం తనకు తగుల్తుందని భూస్వామి కలలో కూడా అనుకోలేదు. వెంటనే మారుమాటాడకుండా ఈ పగడాన్ని తీసుకుని గుర్రాన్ని మిమికి అందించాడు. మిమి ఆ గుర్రాన్ని ఎక్కి ఠీవిగా ఊరిలో తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో మిమికి సాటి రైతు ఒకడు ఎద్దు తీసుకుని కనిపించాడు. ‘ఏమోయ్ మిమి! ఎప్పుడూ లేనిది గుర్రం ఎక్కి తిరుగుతున్నావే! ఏంటి విషయం?’ అని అడిగాడు సాటి రైతు. మిమి అతనికి విషయమంతా చెప్పి ‘ఈ గుర్రాన్ని తీసుకుని ఆ ఎద్దుని నాకు ఇస్తావా!’ అని అడిగాడు. సాటి రైతు మనసులో మురుసుకుంటూ ఆ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు.

 

మిమి ఆ ఎద్దుని తీసుకుని తన ఇంటివైపుకి దారితీశాడు. ఇంతలో ఒక పొట్టేలుని తీసుకుని వెళ్తున్న తన నేస్తం కనిపించాడు. ‘ఏమోయ్‌ మిమి! ఎద్దుని కొనుక్కొని ఇప్పుడే వస్తున్నావా!’ అని అడిగాడు నేస్తం. మిమి అతనికి గతమంతా వివరించి ‘ఈ ఎద్దుని తీసుకుని ఆ పొట్టేలుని నాకు ఇస్తావా!’ అని అడిగాడు. నేస్తం సంతోషంగా ఆ ఎద్దుని తీసుకుని తన పొట్టేలుని అప్పగించాడు.

 

మిమి ఆ పొట్టేలుని తీసుకుని తన ఇంట్లోకి వెళ్తుండగా పొరుగింటాయన, ఆయన కోడీ కనిపించాయి. ‘ఏమనుకోకుండా ఈ పొట్టేలుని తీసుకుని ఆ కోడిని నాకు ఇస్తారా!’ అని అడిగాడు మిమి. పొరుగింటాయన సరేనన్నాడు. ఆ కోడిని చూసుకుని మురిసిపోతూ తన పెరట్లో కూర్చున్న మిమికి ఓ అందమైన పాట వినిపించింది. ఎవరో బైరాగి ఆ రాత్రివేళ పాటపాడుకుంటూ వెళ్తున్నాడు. ఆ పాట విన్న మిమికి భలే అనిపించింది. వెంటనే ఆ బైరాగిని తన ఇంటి ఆవరణలోకి పిలిచి ‘నువ్వు కనుక ఆ పాటను నాకు నేర్పితే... బదులుగా ఈ కోడిని నీకు సమర్పించుకుంటాను’ అని అభ్యర్థించాడు. బైరాగికి ఆ కోడిని చూడగానే నోరూరింది. ఓ పావుగంటలో తను పాడుతున్న పాటని మిమికి నేర్పేసి, కోడిని చంకలో పెట్టుకుని వెళ్లిపోయాడు. మిమి ఆ పాటను పాడుకుంటూ ఉండిపోయాడు.

 

ఈ కథలో మిమి చివరికి నష్టపోయాడని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే అతనికి లాభనష్టాల గురించిన ఆలోచన పెద్దగా లేదు. పైగా పాటలోనే అతనికి సుఖం లభించింది. కానీ మన దృక్పథం కనుక జీవితంలో స్థిరపడటం, వ్యవహారంలో లాభపడటం అయితే మిమి ఉదంతం ఒక గుణపాఠంగా తోస్తుంది. జీవితంలోకి ఎన్ని అమూల్యమైన అవకాశాలు వచ్చినా వాటిని చేజేతులారా నష్టపోయే ప్రమాదాలను తెలియచేస్తుంది.

 

(భూటాన్‌ జానపద కథ ఆధారంగా)

 

- నిర్జర.