ఇండియాలోని బ్రిడ్జ్ చూసి… చైనా ఎందుకు చిటపటలాడుతోంది?

 

భారతదేశంలో యుద్ధమైనా, క్రికెట్ అయినా మనకు వెంటనే గుర్తొచ్చేది పాక్! కాని, అవసరం వస్తే, అవకాశం దొరికితే మనతో ఓ ఆటాడుకోవాలని చూసే దొంగ దేశం… చైనా. మనకి నిజమైన , సత్తా కలిగిన శత్రువు డ్రాగనే! ఈ విషయం చాలా సందర్భాల్లో ఇండియన్స్ మరిచిపోతుంటారు. విచారకరంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ భారత దేశాన్ని ఏలిన వారు కూడా చైనా విషయంలో అజాగ్రత్తగానే వ్యవహరించారు. ఇప్పటి వరకూ ఇండియా ఓడిన ఒకే ఒక్క యుద్ధం చైనాతో చేసిందే. నెహ్రు కాలంలో మనం చైనా చేతిలో ఓడిపోయిన కొంత భూభాగం కూడా ఎర్ర దేశానికి వదులుకోవాల్సి వచ్చింది. అయితే, ఇప్పటికీ చైనా పెట్టే పేచీలు తగ్గటం లేదు. రోజు రోజుకి పెరుగుతున్నాయి.

 

పాక్ కాశ్మీర్ విషయంలో భారత్ ను బేజారు పరుస్తుంటే… చైనా చీటికీ మాటికి అరుణాచల్ విషయంలో కిరికిరి పెడుతుంటుంది. అక్కడ ఎన్నికలు జరిగి మన ముఖ్యమంత్రి పాలన చేస్తున్నా సరే … ఆ ప్రాంతం తనదేనంటుంది మూర్ఖపు చైనా. తాజాగా అలాంటి వితండ వాదం మరోసారి చేసింది. ఈ మధ్యే ప్రధాని మోదీ అసోమ్ లో బ్రహ్మపుత్ర నదిపై దేశంలోనే అతిపొడవైన వంతెన ప్రారంభించారు. ఈ 9.2కిలో మీటర్ల సుదీర్థ వంతెన అసోమ్ రాష్ట్రాన్ని అరుణాచల్ ప్రదేశ్ తో కలుపుతుంది! కేవలం 9కిలో మీటర్ల వంతెనతో జనాలకి 165కిలో మీటర్ల ప్రయాణం చేసే శ్రమ తప్పింది!

 

అవసరమైతే అరుణాచల్ పైన దండెత్తాలని కుట్రపూరిత ఆలోచనలు చేస్తోన్న చైనా ఆ ప్రాంతం మిగతా భారతదేశేంతో మమేకం అవటం సహించలేకపోతోంది. అందుకే, వంతెన ద్వారా అసోమ్ తో అరుణాచల్ ను కలపటం డ్రాగన్ కు అసహనం కలిగించింది. చైనా సరిహద్దు వెంట అరుణాచల్ లాంటి రాష్ట్రాల్లో భారత్ చేపట్టే నిర్మాణల విషయంలో సంయమనం పాటించాలని హెచ్చరికలు చేస్తోంది. మన దేశంలో మనం చేపట్టే అభివృద్ధి పనులకి బీజింగ్ పర్మిషన్ దేనికి? చైనా మనతోనే కాక వియత్నాం, జపాన్ లాంటి దేశాలతో కూడా ఇదే విధమైన దాదాగిరి చేస్తుంటుంది!

 

విదేశాంగ విధానం పై తొలి నుంచీ దృష్టి పెట్టిన మోదీ చైనాను కూడా పాక్ లాగే కట్టడి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. ఎందుకంటే, ఇప్పటికే గత పాలకుల అలసత్వం,అలక్ష్యం వల్ల చైనా నిరంతరాయంగా చిరాకు పెడుతూనే వుంది. ఇక మీదట అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద వుంది.