TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భూమా కుటుంబానికి చిక్కులు తప్పేలా లేవు...

Published on: Mon Oct 7, 2019 12:01PM

నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయంగా మంచి పట్టు సాధించిన ఫామిలీ భూమా కుటుంబం. అయితే భూమా నాగిరెడ్డి దంపతుల మృతి తరువాత రాజకీయ వారసత్వం తీసుకున్న మాజీ మంత్రి భూమా అఖిల చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి, ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కొందరు దూరమవ్వడం, మరికొందరు అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటం, మరో వైపు ఆమె భర్తపై కేసులు నమోదు కావడం, ప్రత్యర్ధులు బలపడ్డం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భూమా కుటుంబానికి రాజకీయంగా చిక్కులు తప్పేటట్లు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాక్షన్ కోటలో రాజకీయం కత్తిమీద సాములా ఉంటుంది. నాయకుడు బలహీనపడ్డాడంటే అనుచరులు అభిమానులు వెంట నడవలేరు. ప్రత్యర్థులు బలపడుతుండటంతో గట్టిగా నిలబడేందుకు ఎత్తులు వేయాలి తప్ప ఉన్న బలం జారి పోయేలా నిర్ణయాలూ వ్యవహారం ఉంటే ఫ్యాక్షన్ ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం.

ఇలాంటి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల పరిస్థితి ఇలాగే ఉంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక భూమా అఖిల ప్రజలకు ప్రత్యేకించి సన్నిహితులకూ, అభిమానులకు, బంధువులకు దూరమయ్యారనే అభిప్రాయం ఆళ్లగడ్డలో ఉంది. తాజాగా భూమా అఖిల భర్త భార్గవ్ రామునిపై వ్యాపార భాగస్వామి అఖిలకు బంధువైన శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటికే భార్గవ రాముడిపై ఎన్నికల సమయంలో ఒక కేసుంది. దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డికి ఆళ్లగడ్డ శివారులో శ్రీ లక్ష్మి ఇండస్ర్టీస్ పేరుతో క్రషర్ పరిశ్రమ ఉంది. ఇందులో భూమా అఖిల ప్రియకు నలభై శాతం వాటా అయితే శివరామిరెడ్డికి అరవై శాతం వాటా ఉంది. సుమారు పదేళ్లుగా ఈ పరిశ్రమను నడిపిస్తున్నారు. అయితే వ్యాపారంలో లావాదేవీల వ్యవహారంలో తలెత్తిన విభేదాల ఇద్దరి మధ్య గ్యాప్ పెంచాయి. ఆ క్రమంలో సదరు పరిశ్రమకు తాళం వేశారు. అయితే క్రషర్ పూర్తిగా తమకే అప్పజెప్పాలని గత నెల పద్నాలుగు వ తేదీన భార్గవరామ్ అనుచర వర్గంతో వెళ్ళి అక్కడ ఉన్న వారిని బెదిరించి పరిశ్రమ తలుపులకు వేరే తాళం వేశారని శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవరాముడు మరి కొంత మంది పై కేసు నమోదైంది.

ఆళ్లగడ్డలో భూమా అఖిల, భర్త భార్గవరాముడు తీరుతో విభేదించి ఇప్పటికే ఆమెకు సోదరుడయ్యే భూమా కిషోర్ రెడ్డి బిజెపిలో చేరారు. ఇప్పుడు ఫ్యాక్టరీ విషయంలో మరో బంధువు పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. గతంలోనే భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాన్ని పక్కనబెడితే సన్నిహితులు దూరం కావడం అనేది తమ వర్గం బలహీనపడటానికి దారి తీస్తోందని భూమా కుటుంబాన్ని అభిమానించే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమా కుటుంబంలో సొంత బలం తగ్గుతూ రావడం ప్రజల్లో తిరిగి అభిమానాన్ని సంపాదించటానికి వచ్చిన అవకాశాల్ని కూడా వినియోగించుకోలేకపోవటం ఆ వర్గీయులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరదలలో ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజుల తరబడి చాలా గ్రామాల్లో జనం బయటకు రాలేని పరిస్థితి, పంటలన్నీ నీట మునిగాయి. ఆ సమయంలో ప్రజలకు అండగా నిలబడి కాస్త సహాయ కార్యక్రమాలు చేపట్టి ఉంటే బాగుండేదని, గతంలో వరదలు వచ్చినప్పుడు భూమా నాగిరెడ్డి అన్నం నీళ్ల ప్యాకెట్లు సొంతంగా సరఫరా చేసి ఆదుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఆళ్లగడ్డ వరదల్లో ప్రత్యర్థులు ఆలస్యంగా జనంలోకి వెళ్లారని భూమా అఖిల జనంలోకి వెళ్ళినా ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టి లేదంటున్నారు.

జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయందిస్తే ఆదరిస్తారని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారని భూమా అభిమానులు వాపోతున్నారు. ఆ క్రమంలో అఖిల సొంత మనుషులు భూమా కుటుంబానికి జరుగుతున్న నష్టాన్ని వారి దృష్టికి తీసుకు రావడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని పెదవి విరుస్తున్నారు. ఇలాగైతే రాజకీయంగా భూమా కుటుంబం పట్టు కోల్పోయి మరింత చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది అంటున్నారు భూమా అభిమానులు.