ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా: భూమా బ్రహ్మానందరెడ్డి

 

ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎంపిక చేయడం, ప్రకటించడం ఒక ఎత్తైతే.. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అసంతృప్తులను బుజ్జగించడం మరో ఎత్తు. అయితే ఏపీలో అధికార పార్టీ టీడీపీకి మాత్రం ఇంకా పూర్తిగా అభ్యర్థులను ప్రకటించకుండానే అసంతృప్తి సెగలు తగులుతున్నాయి. 126 మంది అభ్యర్థులతో టీడీపీ తొలిజాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ అభ్యర్థిగా మంత్రి భూమా అఖిల ప్రియను ఖరారు చేయగా.. నంద్యాల మాత్రం పెండింగ్‌లో పెట్టారు. అయితే రెండో జాబితాలో ఖచ్చితంగా తన పేరు ఉంటుందని టికెట్ తనదేనని.. భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
ఇదే విషయమై శనివారం మధ్యాహ్నం.. నంద్యాలలో కార్యకర్తలతో బ్రహ్మానందరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంద్యాల టికెట్ తప్పకుండా తనకే వస్తుందన్నారు. టికెట్‌ రాకుంటే సీఎం చంద్రబాబు, దివంగత నేత భూమా నాగిరెడ్డి ఫొటోలతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే ఈసారి నంద్యాల టికెట్ తనకివ్వాలని ఏవీ సుబ్బారెడ్డి.. తన అల్లుడికే నంద్యాల టికెట్ ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి నంద్యాల అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.