టీడీపీ కి బిగ్ షాక్.. జనసేనలోకి మంత్రి అఖిల ప్రియ?

 

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. మంత్రి అఖిల ప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పి.. త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త‌ల్లి శోభా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఉపఎన్నిక‌ల ద్వారా వైసీపీ తరుపున అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే అయ్యారు. తరువాత తండ్రి భూమా నాగిరెడ్డితో క‌లిసి వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఆ త‌రువాత తండ్రి ఆకస్మికంగా మ‌ర‌ణించారు. కొద్ది కాలానికి అఖిల ప్రియ మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా ఉన్న అఖిల ప్రియ అంద‌రినీ కలుపుకొని పోవడంలో స‌క్సెస్ కాలేక పోయార‌నే భావ‌న ఉంది. దీంతో జిల్లాలోని టీడీపీ నేతలే అఖిలకు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నారు. దీంతో అఖిల ప్రియ సైతం పార్టీ నేత‌ల తీరుపై అస‌హ‌నంతో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అఖిల ప్రియ పార్టీ మారుతారంటూ కర్నూల్ జిల్లాలో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. టీడీపీలో త‌నకు వ్య‌తిరేకంగా నేత‌లు ప‌ని చేస్తున్నా.. అధినాయ‌క‌త్వం వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం పై అఖిల ప్రియ అసంతృప్తితో ఉన్న‌ట్లు సమాచారం. దీనికి తోడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఆళ్ల‌గ‌డ్డ నుండి టీడీపీ బ‌రిలోకి దింపుతోంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. నంద్యాల నుండి మైనార్టీ అభ్యర్దికి అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. క‌ర్నూలు ఎమ్మెల్యేగా అఖిల ప్రియ మేన‌మామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో భూమా కుటుంబం నుండి బ్ర‌హ్మానంద‌రెడ్డికి మాత్ర‌మే టిక్కెట్ ద‌క్కుతుందంటూ పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలపై అగ్ర‌హంతో ఉన్న అఖిల ప్రియ.. కర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌నకు సీఎం చంద్రబాబు వ‌చ్చినా దూరంగా ఉన్నారు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే అఖిల ప్రియ సీఎం ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్నార‌ని.. సీఎంకు స‌మాచారం కూడా ఇచ్చార‌ని సన్నిహితులు చెబుతున్నారు. అయినా అఖిల ప్రియ టీడీపీని వీడుతున్నారనే ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు.

అఖిల ప్రియ త్వ‌రలోనే టీడీపీని వీడి.. ఎన్నిక‌ల ముందు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భూమా కుటుంబానికి పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. శోభా నాగిరెడ్డి 2004 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుండి ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ త‌రువాత వైసీపీలో చేరారు. భూమా దంప‌తుల మ‌ర‌ణం త‌రువాత పవన్ కళ్యాణ్.. వారి పిల్ల‌ల గురించి ప‌లు మార్లు ఆరా తీసేవారట. ఇప్పుడు కర్నూల్ జిల్లా టీడీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీలో చేరటం కరెక్ట్ అని అఖిల ప్రియ భావిస్తున్నారట. జనసేనలో అయితే తనకు తగిన గౌరవం, గుర్తింపు దక్కుతాయని.. అందుకే వీలైనంత త్వరగా టీడీపీని వీడి జనసేనలో చేరాలని అఖిల ప్రియ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అఖిల ప్రియ నిజంగా జనసేనలో చేరతారో లేక టీడీపీలోనే ఉంటారో చూడాలి.