ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభం.. ఎప్పుడంటే?
Published on: Wed Jul 8, 2026 10:22AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం (జులై 7) స్వయంగా పరిశీలించారు. టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్, రన్‌వే, గ్రీనరీ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులు పూర్తి అయ్యాయనీ, విమానాశ్రయం ఆపరేషన్లకు సిద్ధంగా ఉందని నిర్మాణ సంస్థ అధికారులు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని ఊహించలేదన్నారు. కూటమి ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ప్రజల సహకారంతో కేవలం రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్న ఆయన, విమానాశ్రయానికి అవసరమైన లైసెన్స్ కూడా మంగళవారం (జులై 7) లభించిందనీ, ఇక ప్రారంభోత్సవమే తరువాయనీ చెప్పారు.
ఈ ప్రారంభోత్సవం ఎప్పుడు అన్న ప్రశ్నకు.. ప్రధానమంత్రి ఎప్పుడు ప్రారంభోత్సవానికి రావడానికి తేదీ ఖరారు చేస్తారో, ఆరోజునే ప్రారంభిస్తామన్నారు. అలాగే.. ప్రారంభోత్సవం జరిగిన వారం రోజులలోనే ఇక్కడ నుంచి విమానరాకపోకలను ప్రారంభిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక ఆకర్షణగా చేప ఆకారంలో టెర్మినల్ భవనాన్ని నిర్మించినట్లు చెప్పిన ఆయన.. విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానిక ప్రజలు అందిం చిన సహకారాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.


