TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ టు భోగాపురం.. భోగాపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయన తొలి విమానం.!

Published on: Mon Aug 17, 2026 8:55AM

విజయనగరం జిల్లా భోగాపురం  అంతర్జాతీయ విమానాశ్రయం' నుంచి వాణిజ్య విమాన సర్వీసులు సోమవారం (ఆగస్టు 17) అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6ఇ6408 విమానం ఉదయం 6:45 గంటలకు భోగాపురం రన్‌వేపై  ల్యాండ్ అవ్వడంతో ఇక్కడ కార్యకలాపాలు  అఫీషియల్ గా ఆరంభమయ్యాయి. 

నూతన విమానాశ్రయానికి చేరుకున్న తొలి విమానానికి, అందులోని ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ నిర్వాహక సంస్థ జీఎంఆర్, పౌర విమానయాన శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలి ప్రయాణానికి గుర్తుగా ప్రయాణికులకు ధ్రువీకరణ పత్రాలతో పాటు, స్థానిక సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏటికొప్పాక బొమ్మలను జ్ఞాపికలుగా అందజేశారు. దీని తర్వాత కొద్దిసేపటికే బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా ఇక్కడ ల్యాండ్ అయింది.

భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో, విశాఖపట్నంలోని పాత ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే పౌర విమాన సర్వీసులన్నింటినీ ఇక్కడికి మార్చారు. తొలిరోజే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాలు ఇక్కడనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సోమవారం (ఆగస్టు 17) మొత్తం 31 సర్వీసులు నడవనుండగా,   7 వేల మంది రాకపోకలు సాగించనున్నారు. ఇక విశాఖ నుంచి  ఆదివారం(ఆగస్టు 16) 10.45 గంటలకు చివరి విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి వాణిజ్య సేవలు నిలిచిపోయాయి.

భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు విమానాశ్రయం ప్రారంభమవ్వడం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాలు వేగంగా విస్తరించేందుకు ఇది  దోహదపడుతుందంటున్నారు.  

Bhogapuram, International, Airpori, !stFilght, From Hyderabad, Landed