కోవాగ్జిన్ టీకా వీళ్లకు నిషేదం! భారత్ బయోటెక్ ఫ్యాక్ట్ - షీట్

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సోమవారం వరకు 580 మంది అస్వస్థతకు గురి కాగా.. 
ఇద్దరు మరణించారు. దీంతో  మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, తాము తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న భారత్ బయోటెక్ .. టీకా ఎవరు తీసుకోకూడదన్న విషయంపై  కీలక ప్రకటన విడుదల చేసింది.  తాము తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు ఎవరు దూరంగా ఉండాలన్న విషయంపై ఓ ఫ్యాక్ట్ - షీట్ ను భారత్ బయోటెక్ ప్రకటించింది

గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్ ను తీసుకోవద్దని సలహా ఇచ్చింది భారత్ బయోటెక్. కొవాగ్జిన్ కాకుండా మరో వేరియంట్ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు కూడా కోవాగ్జిన్ తీసుకోవద్దని సూచించింది.  జ్వరంతో బాధపడుతున్న వారు కూడా కోవాగ్జిన్ టీకాకు దూరంగా ఉండాలని వెల్లడించింది.  వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్ ఆఫీసర్ లకు తప్పనిసరిగా తెలియజేయాలని.. వారి సలహా, సూచనల మేరకు నడచుకోవాలని భారత్ బయోటెక్ కోరింది.  

 మరోవైపు మూడు రోజుల వ్యవధిలో సుమారు 3.80లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు  కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో 580 మందిలో దుష్ప్రభావాలు వెలుగు చూశాయని, ఏడుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇద్దరు మృతిచెందిన అందుకు కరోనా టీకా కారణం కాదని స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ మొరదాబాద్‌‌లో ఓ వ్యక్తి మృతిచెందారు. వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తర్వాత మహిపాల్ సింగ్ (46) అనే ప్రభుత్వ హాస్పిటల్ వార్డు బాయ్ మృతిచెందారు. ఆయన మృతికి, కరోనా వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి తెలిపారు. కార్డియో పల్మనరీ వ్యాధి కారణంగా కార్డోజెనిక్ అరెస్టు  ద్వారా మహిపాల్ మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టమైందని చెప్పారు. 43ఏండ్లు కలిగిన మరో వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బళ్లారి‌లో మృతిచెందాడు. కార్డియో పల్మనరీ విఫలం కావడంతో మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది.