‘భారత రత్న’ రేసులో మేజర్ ధ్యాన్ చంద్
Published on: Thu Jan 26, 2012 8:56AM
న్యూ
ఢిల్లీ: భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అవార్డుకు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరును కేంద్ర, యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం సిఫారసు చేసింది. ధ్యాన్ చంద్‌తోపాటు ఒలింపిక్ స్వర్ణ విజేత షూటర్ అభినవ్ బింద్రా, పర్వతారోహకుడు టెన్జింగ్ నార్గేలను అవార్డు కోసం సూచించింది. దీంతో ధ్యాన్ చంద్ సిఫారసు పట్ల హాకీ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. క్రీడా మంత్రిత్వశాఖ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం భారత జాతీయ క్రీడగా వెలుగొందుతున్న హాకీ క్రీడ అలనాడు ధ్యాన్ చంద్ హయంలో ‘స్వర్ణ’ కాంతులీనింది.
కాగా, దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ అవార్డుకు ‘క్రికెట్ గాడ్’, ‘మాస్టర్ బ్లాస్టర్’, సచిన్ తెండూల్కర్ అర్హుడు కాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) భావిస్తోందా? కోట్లాది క్రీడాభిమానుల ఆరాధ్య దైవం సచిన్‌కు ‘భారత రత్న’ అవార్డు ఇవ్వాలని అన్ని వర్గాలు ముక్త కంఠంతో ఘోషిస్తున్న నేపథ్యంలో బిసిసిఐ అవలంబిస్తున్న వైఖరి ఇదే అనుమానాలకు తావిస్తోంది మరి. ‘భారత రత్న’ అవార్డు క్రీడా రంగానికీ వర్తింపజేయాలని కోరుతున్న కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ..కొందరు క్రీడాకారుల పేర్లను బుధవారం సిఫారసు చేసింది. ఇందులో సచిన్ తెండూల్కర్ పేరు లేకపోవడం సంచలనం కలిగించింది. తీరా అసలు సంగతి ఆరా తీస్తే..బిసిసిఐ సచిన్ పేరును సదరు మంత్రిత్వశాఖకు సిఫారసు చేయలేదనే విషయం బయటపడింది. ‘భారత రత్న’కు వివిధ క్రీడా విభాగాలు క్రీడాకారుల పేర్లను సిఫారసు చేసిన నేపథ్యంలో అలా చేయాలో లేదో తనకు తెలియదని బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ముంబయిలో అన్నారు. అవార్డు విషయంలో ప్రత్యేకాధికారాలన్నీ ప్రభుత్వానియేనని తాను భావిస్తున్నానన్నారు. అయితే సిఫారసు చేయాల్సి వస్తే తెండూల్కర్ ‘భారతరత్న’కు అర్హుడేనని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఐపిఎల్ చైర్మన్, సీనియర్ బిసిసిఐ పర్యవేక్షకుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ‘భారత రత్న’కు బిసిసిఐ సిఫారసు చేయదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఎవరికివారే తమ పేర్లను సూచించుకోవాలన్నారు. క్రీడాకారుల అవార్డుల విషయంలో ‘అర్జున’ అవార్డుకు మినహా మరే ఇతర అవార్డులకు బిసిసిఐ సిఫారసు చేయడం జరగదని శుక్లా పేర్కొన్నారు. సచిన్‌కు ‘పద్మ’ అవార్డులు గతంలో వచ్చిన నేపథ్యంలోనూ బిసిసిఐ ఎన్నడూ ఎటువంటి సిఫారసు చేయలేదన్నారు. అదే విధంగా ఇప్పుడు ‘భారత రత్న’ విషయంలోనూ ఎలాంటి సిఫారసులు బిసిసిఐ తరఫున ఉండబోవన్నారు. ఇందులో ప్రభుత్వానిదే తుది నిర్ణయమని ఎంపిక చేసినా, అవార్డు కేటాయించినా వారిష్టమేననే ధోరణిలో బదులిచ్చాడు.


