భారత్ బయోటెక్ నుంచి మరో కోవిడ్ టీకా!
Published on: Fri Jan 8, 2021 1:43PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ తయారు చేసిన భారతీయ దిగ్గజ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్.. కోవిడ్ కట్టడికి మరో టీకా తీసుకురాబోతోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఇప్పటికే కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందింది భారత్ బయోటెక్. ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది. దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమవుతాయని స్వదేశీ ఔషధ రంగ సంస్థ తెలిపింది. ఈ టీకా అభివృద్దికి సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో ఒప్పందం చేసుకుంది. ముక్కు ద్వారా ఒక్క డోసులోనే కరోనా టీకాను అందించే విధంగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.
కోవిడ్ నివారణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు మోతాదుల్లో అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం 2.6 బిలియన్ల సిరంజీలు వాడాల్సి ఉంటుందని అంచనా.వందల కోట్ల సిరంజీలు వాడి పడేయడం వలవ అవి కాలుష్యానికి కారణమవుతాయనే ఆందోళన ఉంది.అందుకే కాలుష్య సమస్య లేకుండా ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించామని చెప్పారు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల . తమ టీకా భారత్ తలపెట్టిన భారీ టీకా కార్యక్రమ ఖర్చుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపారు.
‘ముక్కు ద్వారా అందించే టీకా (BBV154) వల్ల ఎదురయ్యే దుష్ర్పభావాలు, రోగ నిరోధకత, సవాళ్లను గుర్తించేందుకు భారత్, యూఎస్‌లో ప్రి క్లినికల్ ప్రయోగాల నిర్వహణ పూర్తయింది. మొదటి దశ మానవ ప్రయోగాలు 2021 ఫిబ్రవరి-మార్చిలో మనదేశంలో ప్రారంభం కానున్నాయి’ అని భారత్ బయోటెక్ వెల్లడించింది.


