TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సారీ చెప్పిన భగవంత్‌మాన్ సింగ్...

Published on: Fri Jul 22, 2016 6:17PM

భద్రతా వ్యవస్థను దాటుకుంటూ పార్లమెంట్‌లోకి వెళ్లిన ఘటనపై ఆప్‌ ఎంపీ భగవత్‌మాన్ సింగ్ పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా చేశానని, ఇది ఇంత పెద్ద విషయమవుతుందని అనుకోలేదని భగవంత్ తెలిపారు. భగవంత్ పటిష్ట భద్రతా వ్యవస్థను దాటుకుంటూ పార్లమెంట్‌లోకి వెళ్లారు. అంతేకాకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 12 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆయన రన్నింగ్ కామెంటరీ కూడా చెప్పారు.

దీనిపై ఉభయసభలు అట్టుడికిపోయాయి..బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దేశ భద్రతకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. భగవంత్‌మాన్ ఒకసారి కాకుండా మళ్లీ చిత్రీకరిస్తానని చెప్పడమేంటని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. చేసిన తప్పు మళ్లీ మళ్లీ చేస్తానన్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలే సభే నిర్ణయించాలని పేర్కొన్నారు.

 

తీవ్ర గందరగోళం మధ్య..భగవంత్‌పై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్యలు చేపట్టి..సమన్లు జారీ చేశారు. దీంతో స్పీకర్ ఎదుట హాజరైన భగవంత్ సుమారు 20 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. తను చేసిన పనికి క్షమించాలని..పార్లమెంటు, దాని నిర్వహణ ఎలా ఉంటుందో పంజాబ్‌లోని తన నియోజకవర్గ ప్రజలకు చూపించడానికి ఇలా చేశానని భగవంత్ చెప్పారు.