భగవద్గీత వయస్సు 5,153 ఏళ్లని మీకు తెలుసా?  


మార్గశిర శుద్ధ ఏకాదశి మామూలు ఏకాదశి కాదు. ఎందుకంటే, 5వేల ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను బోధించాడు! అందుకే, మార్గశీర్ష మొదటి ఏకాధశిని గీతా జయంతి అంటారు. అంటే, ఆ రోజున గీత జన్మించిందన్నమాట! బహుశా ఈ కారణం చేతనే కృష్ణుడు ''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు. మాసాలలో తాను మార్గశీర్ష మాసం అని భగవానుడు ప్రత్యేకంగా చెప్పాడు. అంతటి విశిష్ఠత ఈ గీతా జయంతి కారణంగానే వచ్చిందనుకోవచ్చు.... 


మామూలుగా భగవద్గీత కృష్ణార్జునుల సంవాదం అని మనకు తెలుసు. కాని, మనకు తెలియని ఇంకా బోలెడన్ని విషయాలు, విశేషాలు గీతలోనూ, గీత గురించి వున్నాయి. అందులో ముఖ్యమైన అయిదు సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం! 


1. భగవద్గీత పార్థుడికి, పార్థ సారథికి మధ్య చర్చ అయితే... గీత అని ఎందుకు అన్నారు? గీత అంటే పాట. భగవద్గీత పాట రూపంలో అనుష్టుప్ ఛందస్సులో వుంటుంది. ప్రతీ శ్లోకంలోని ప్రతీ పాదానికీ 32అక్షరాలు వుంటాయి. కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలకి త్రిష్టుప్ ఛందస్సు కూడా ఉపయోగించటం జరిగింది. అందులో నాలుగు పాదాలు, పాదానికి 11అక్షరాలు వుంటాయి. 2, 8, 11 అధ్యాయాల్లో మనం ఇలాంటి చూడవచ్చు... 


2. భగవద్గీత పరిమాణం ఎంత? భగవద్గీత మొత్తం 18అధ్యాయాల్లో విస్తరించి వుంది. అందులో మొత్తం 7వందల శ్లోకలు వున్నాయి. 


3. భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాల క్రితం, ఎప్పుడు భగవానుడు ప్రబోధించాడు? మహాభారతంలో పేర్కొన్న వివిధ ఖగోళ విశేషాలు, గ్రహాణాల ఆధారంగా లెక్కగడితే క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరంలో కలియుగం ప్రారంభమైంది! అంతకు 35ఏళ్లు ముందు కురుక్షేత్రంలో గీతా బోధ జరిగింది! అంటే... భగవద్గీత క్రీస్తు పూర్వం 3137వ సంవత్సరం నాటిదన్నమాట!


4. భగవద్గీత ఇంగ్లీష్ లోకి ఏ సంవత్సరంలో అనువాదించారు? 1785లో! చాల్స్ వికిన్స్ లండన్లో ఈ తొలి అనువాదం చేశాడు. అంతకు కేవలం 174ఏళ్లే ముందే ఇంగ్లీష్ లోకి బైబిల్ ను అనువదించారు! 


5. భగవద్గీత ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని భాషల్లోకి తర్జుమా అయింది? గీతాచార్యుడు సంస్కృతంలో చేసిన బోధనని ఇప్పటి వరకూ 175భాషల్లోకి అనువదించారు!