జగన్ అరెస్టుపై పందాలు ...
Published on: Thu Apr 12, 2012 4:23PM
కాదేది కవితకనర్హం అని మహాకవి అంటే నేటి పందాల రాయుళ్ళు మాత్రం ఐ.పి.ఎల్. క్రికెట్ పోటీల నుంచి జగన్ అరెస్టు వరకు తమ జూదాలకు కాదేదీ అనర్హమంటున్నారు. అక్రమ ఆస్తులు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత, పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అరెస్టు అవుతారా? లేదా? అనే అంశంపై కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చర్చజరుగుతోంది. పందాల రాయుళ్ళు మరో అడుగు ముందుకువేసి ఏకంగా పందాలు కాస్తున్నారు.
కోవూరు ఉప ఎన్నికల్లో మెజారిటీపై పందాలు కాసి లాభాలు పొందినవారు నేడు జగన్ అరెస్టుపై పందాలు కాస్తున్నారు. సిబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో విజయసాయి రెడ్డి రెండో ముద్దాయిగా వున్నారు. రెండో ముద్దాయిగా వున్న విజయసాయిరెడ్డిని అరెస్టు చేయడంలో చూపిన శ్రద్ధ మొదటి ముద్దాయి జగన్ ను అరెస్టు చేయడంలో మీనమేషాలు లెక్కించడాన్ని బట్టి జగన్ ను అరెస్టు చేయడానికి సిబీఐ, కేంద్రప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అరెస్టు చేసేవారైతే ఈపాటికే అరెస్టు చేసేవారని. అందువల్ల ఇక జగన్ అరెస్టు కారని చెబుతూ ఈ మేరకు సవాల్ చేస్తూ పందాలకు సిద్ధం అవుతున్నారు. కొంచెం ఆలశ్యమైనా జగన్ అరెస్టు కాకతప్పదని ఇతరపార్టీ కార్యకర్తలు అంటున్నారు. జగన్ అసలు అరెస్టుకారాని పందాలు కాస్తుంటే మరికొందరు రానున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తారని, మరికొందరు ఉప ఎన్నికలకు ముందే అరెస్టు అవుతారంటూ పందాలు కాస్తున్నారు. పందాల సంగతి ఎలా వున్నప్పటికీ వేలకోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సిబీఐ అధికారులు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా జగన్ ను అరెస్టు చేయకపోతే ప్రజాస్వామ్యం పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలలో నమ్మకం లేకుండా పోతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో అధికారులను అరెస్టు చేసినంత సులభంగా రాజకీయ నాయకులను అరెస్టు చేయకపోవడం పట్ల కూడా ప్రజలలో చర్చ జరుగుతోంది.


