చరిత్రలో అద్భుతాలుగా నిలిచిపోయిన… వాజ్ పేయ్ 5 ప్రసంగాలు ఇవే!

వాజ్ పేయ్ అనగానే మనకు ఓ మాజీ పీఎం మాత్రమే గుర్తుకు రారు. ఆయన ప్రధాని కావటం కేవలం క్లైమాక్స్ మాత్రమే! అంతకు ముందే బోలెడంత సినిమా నడిచింది! దానికి ఆయనే దర్శకుడు, ఆయనే హీరో! అసలు వాజ్ పేయ్ 1996లో తొలిసారి ప్రధాన మంత్రి కావటానికి ముందే సుప్రసిద్ధులు! ఎంతగా ఆయనకు గొప్ప పేరు వుండేదంటే… అప్పట్లో… ఆయన గురించి… భారతదేశం పొందకుండా మిగిలిపోయిన అతి గొప్ప ప్రధాని వాజ్ పేయ్ అనేవారు! అలా ఆయన ప్రధాని అవ్వక ముందే ప్రధాన మంత్రి స్థాయిని పొందేశారు! ఇక 96లో, 98లో, 99లో మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేసి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చాశారు! ఇంతకీ ఏంటది? భారతదేశాన్ని ఒక పూర్తి కాలం పరిపాలించిన తొలి కాంగ్రేసేతర ప్రధాని కావటం! అంతకంటే మించీ హస్తిన సింహాసనాన్ని కాషాయం అంటలేదని భావించిన వార్ని తప్పుగా నిరూపిస్తూ హిందూత్వ విజయానికి అత్యుత్తమ సంకేతంగా నిలవటం! ఈ రోజు మోదీ అనే పరిణామం సాధ్యమైందంటే… దాని వెనుక వాజ్ పేయ్ అనే మూలం వుండబట్టే!

 

 

అటల్ బిహారీ వాజ్ పేయ్ కి నిస్సందేహంగా రాజకీయ కోణం వుంది. ఆయనని చరిత్ర తప్పకుండా సాటిలేని రాజనీతిజ్ఞుడుగానే గుర్తు పెట్టుకుంటుంది! కానీ, వాజ్ పేయ్ కేవలం పొలిటీషన్ మాత్రమే కాదు. అదే ఆయనకు, ఇతర నేతలకు వున్న తేడా! వాజ్ పేయ్ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, హిందూత్వవాది, అన్నిటికంటే మించి … అద్బుతమైన ఉపాన్యాసకుడు! ఆయన సభలో నోరు తెరిచినా, బహిరంగ సభలో నోరు మెదిపినా అత్యంత సామాన్య జనం మొదలు మహా మేధావుల దాకా అందరూ చెవులు రిక్కించి వినేవారు. అంతటి విషయం, విశేషం రెండూ వుండేవి ఆయన ప్రసంగాల్లో! ఆయన మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి అందులో గొప్ప సందేశాన్ని అందించే వారు కాదు! ఆయన గొప్ప సందేశం అందించాల్సి వస్తేనే మాట్లాడేవారు! ఊరికే ఒక్క మాట కూడా మాట్లాడని నిజమైన మౌని… వాజ్ పేయ్!

 

 

వాజ్ పేయ్ నోటి వెంట వచ్చిన ప్రతీ ప్రసంగం చారిత్రాత్మకమే అయినా … అందులో అయిదు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటిల్లో మొదటిది… 1996లో ఆయన ప్రభుత్వం కూలిపోయే స్థితి వచ్చినప్పుడు పార్లమెంట్లో చేసింది. ఒకింత సుదీర్ఘ ఉపన్యాసం తరువాత ఆయన ‘’నేను రాష్ట్రపతి వద్దకెళ్లి నా రాజీనామా అందిస్తాను’’ అన్నారు! ఇది నిజంగా ఆశ్చర్యమే! వాజ్ పేయ్ ఒటింగ్ కు అడగలేదు. ఆయన ఒటింగ్ పెట్టమని స్పీకర్ ని అడిగినా ఓడేవారే! అయినా, ఒక అద్భుత ప్రసంగం తరువాత ప్రతిపక్షానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం స్వచ్ఛందంగా ఇచ్చేస్తూ తన పరిణతిని ప్రదర్శించారు! కాకపోతే, ప్రధానిగా రాజీనామా చేయబోతూ కూడా … ‘’మేం ప్రారంభించిన దేశానికి ఉపయోగపడే పనులు మీ చేత కూడా చేయించే దాకా మేం విశ్రమించం!’’ అంటూ ముగించారు! ఇదీ వాజ్ పేయ్ మార్కు అత్యున్నత రాజకీయ పరిపక్వత!

 

 

ఇక రెండోసారి … భారత శాస్త్రవేత్తలు ప్రోక్రన్ లో అణు పరీక్షలు జరిపాక ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం! ఇది చాలా చిన్న మీడియా మెసేజ్! ప్రోక్రన్ లో అణు పరీక్షలు జరిపాం. విజయవంతం అయ్యాయి. 1974 తరువాత ఈ విజయం సాధించిన మన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు… అన్నారు! ఇప్పుడు వింటే ఇది మామూలుగా వుండవచ్చు కానీ… 1998 నాటి ఇండియాకి అతి పెద్ద విజయం! అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ లాంటివి ఒకవైపు, మనం ఒకవైపు! భారత్ తన ఆత్మరక్షణ విషయంలో ఎవరి ఒత్తిడికి తలొగ్గదని నిరూపించింది ఆనాటి వాజ్ పేయ్ సర్కార్! ముఖ్యంగా ప్రోక్రన్ అణు బాంబులు పాకిస్తాన్, చైనాల గుండెల్లో పేలాయి!

మూడోసారి వాజ్ పేయ్ ఉపన్యాసం చరిత్రలో నిలిచిపోయింది… ప్రోక్రన్ పరీక్షల విషయంలోనే! ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ … ‘’ ఇప్పటికే మూడు సార్లు మనం విదేశీ దాడులకు బాధితులుగా మిగిలాం! ఇక మీదట కాదు. మనం ఎవరి మీదా దాడి చేయటానికి ఈ పరీక్షలు చేయలేదు. మనకు ఆ ఉద్దేశం కూడా లేదు’’ అంటూ స్పష్టం చేశారు! 1947 నుంచీ స్వంత మెజార్టీ వున్న ఏ భారత ప్రభుత్వమూ ఇలా మాట్లాడలేదు. తొలిసారి వాజ్ పేయ్ పార్లెంట్ సాక్షిగా భారత్ విదేశీ దాడుల్ని సహించబోదని ప్రపంచానికి సూటిగా చెప్పారు! వాజ్ పేయ్ కంఠంలోంచి వచ్చీ చరిత్రలో మార్మోగిపోతూనే వున్న మరో ఉపన్యాసం 1980 నాటిది. బీజేపీ పుట్టిన తొలి నాళ్లలో ఆయన ముంబై మహాసభలో ప్రసంగించారు. ఏప్రెల్ 6 , 1980న కమలదళం కార్యకర్తల సమావేశంలో వాజ్ పేయ్ అద్భుతంగా ఉపన్యసించారు. ఆయన ప్రసంగం ముగిస్తూ అన్నమాటలు ఇప్పటికీ కాషాయ శ్రేణులకు ప్రేరణ కలిగిస్తూనే వుంటాయి! ‘’చీకట్లు తొలిగిపోతాయి! సూర్యుడు ఉదయిస్తాడు! కమలం వికసిస్తుంది!’’ అన్నారు! 2014లోమోదీ స్వంత మెజార్టీతో ప్రధాని అయిన వేళ నిజంగానే వాజ్ పేయ్ చెప్పినట్లు కమలం సంపూర్ణంగా వికసించింది!

 

 

ఇక అయిదోసారి వాజ్ పేయ్ పార్లమెంట్లో గర్జించిన సందర్భం… ఐకే గుజ్రాల్ ప్రధానిగా వున్నప్పుడు! ఆయన పీఎంగా వుండగా లాలు ప్రసాద్ యాదవ్ బీహార్ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. బీహార్ లో పాలన పూర్తిగా గాడితప్పింది. గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్రం మాత్రం లాలూని చూసీ చూడనట్టు వదిలేస్తూ వచ్చింది! వాజ్ పేయ్ ఆ సమయంలో లోక్ సభలో ఛండప్రఛండగా ప్రసంగించారు! ఆనాటి ప్రధానమంత్రి దాదాపు నిశ్చేష్ఠులు కావాల్సి వచ్చింది!రాజకీయ నేతలు చాలా మంది మాటలు చెబుతారు! కానీ, వాజ్ పేయ్ మాటలు అలాంటివి కావు! సాధారణ నేతల మాటలు పెదల మీద నుంచి వస్తే… ఆయన పలుకులు గుండెలోతుల్లోంచీ వచ్చేవి! అందుకే అవి ఎదుటి వారి చెవుల్లోకి మాత్రమే కాక… నేరుగా చరిత్రలోకి వెళ్లిపోయాయి! శాశ్వతంగా స్థిరపడిపోయాయి!