బెంజ్ కారు ఎంతపని చేసింది?.. ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందో మరి!!

గత ప్రభుత్వ హయాంలో వేలు, లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించిన వైసీపీ సర్కార్.. చివరికి ఈఎస్ఐ స్కామ్ ను తెరమీదకు తీసుకొచ్చి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసింది. మొదట 150 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. తరువాత మూడు కోట్లు అన్నారు. చివరికి అసలు అచ్చెన్నకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అన్నారు. అంటే ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. కేవలం ఆయన ఒక కంపెనీని పరిశీలించండని ఇచ్చిన లేఖ ఆధారంగా.. అర్థరాత్రి గోడలు దూకి మరీ అరెస్ట్ చేశారు. శస్త్రచికిత్స జరిగిందని చెప్పినా వినకుండా వందల కిలోమీటర్లు కారులో తిప్పారు. దీంతో అచ్చెన్నకు రెండోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. దాదాపు 80 రోజుల తరువాత అచ్చెన్న బెయిల్ పై విడుదల అయ్యారు. ప్రతిపక్షంలోని బలమైన గొంతుని నొక్కాలన్న ఉద్దేశంతోనే అచ్చెన్నను అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఆరోపించింది. ఇదిలా ఉంటే.. అసలు ఆధారాలు లేకుండానే ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నను 80 రోజులు నిర్బంధించిన జగన్ సర్కార్.. ఇప్పుడు సాక్షాత్తు కార్మిక శాఖా మంత్రి మీదే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడేం చేస్తుంది జగన్ సర్కార్?.

 

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు.. పుట్టినరోజు సందర్భంగా ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే, ఇది గిఫ్ట్ కాదని మంత్రికి ఇచ్చిన లంచం అని టీడీపీ ఆరోపిస్తోంది. మంత్రి మాత్రం అబ్బే తన కుమారుడు కారుతో ఫోటో మాత్రమే దిగాడని, తన కుమారుడు చేతుల మీదుగా వాళ్ళు కారు తీసుకున్నారని, ఆ కారు తనదని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. 

 

అయితే మంత్రి ఆ కారు తమ పేరు మీద లేదని చెప్తున్నప్పటికీ.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారు మంత్రి కుమారుడిది కాకపోతే ఆయన ఆ కారులో ఎందుకు తిరుగుతున్నట్టు?. మంత్రి కుమారుడు ఈశ్వర్ ఆ కారులో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు చాలా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎవరైనా ఒకటి రెండు సార్లు ఫొటోస్ దిగుతారు. అంతేకాని, ఏడాది పొడవునా తమ దగ్గరే కారు ఉంచుకొని ఫొటోస్, వీడియో తీస్తూ తిరుగుతుంటారా. అంటే ఆ కారు ఎవరు పేరు మీదున్నా.. ఆ కారు మాత్రం మంత్రి కుమారుడిదే అని అర్థమవుతుంది.

 

అసలు ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న కార్తీక్ మంత్రి కుమారుడుకి అంత ఖరీదైన కారు ఎందుకు ఇచ్చాడు. కోట్ల విలువైన గిఫ్ట్ లు ఇచ్చే అంత రిలేషన్ ఏంటి వాళ్ళకి?. అతను ఏ లబ్ది పొందకుండానే అంత ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడా?. ఒకసారి మంత్రి ఈ కార్తీక్ ని దత్త పుత్రుడిగా ప్రకటించారట. అంతేకాదు, ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన అచ్చెన్నకు బెయిల్ రావడానికి 80 రోజులు పట్టింది. కానీ, ఏ-14 కార్తీక్ కి మాత్రం వెంటనే బెయిల్ వచ్చింది. అదెలా సాద్యమైంది? మంత్రి అండదండలు లేకుండానే ఇదంతా జరుగుతుందా?.

 

ఇంకో విషయం ఏంటనే..మంత్రి కుమారుడు వీడియోస్ లో మరి కొన్ని ఖరీదైన కార్లు కూడా కనిపిస్తున్నాయి. అంతంత ఖరీదైన కార్లు ఎక్కడి నుండి వచ్చాయి?. అంతేకాదు మంత్రి కుమారుడి వివాహ వేడుక సినీస్టార్స్ వెడ్డింగ్ అంత రిచ్ గా జరిగింది. ఇన్నిన్ని డబ్బులు ఎక్కడివి?. గత ఎన్నికల అఫిడవిట్ లో మంత్రి ఇచ్చిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?. చరాస్తులు స్థిరాస్తులు మొత్తం కలిపి 80 లక్షలు. కేవలం 80 లక్షల ఆస్తి కలిగిన కుటుంబం అంత ఖర్చు ఎలా పెడుతుంది? కోట్ల ఖరీదైన కార్లు ఎలా వాడుతుంది. అయితే కొని ఉండాలి లేదా ఎవరైనా ఇచ్చి ఉండాలి. ఒకవేళ కొని ఉంటే.. మంత్రి అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చినట్టు లెక్క. అంటే అసలు ఆయన ఎన్నికే చెల్లదు. పోనీ గిఫ్ట్ ఇచ్చారనుకుందాం. ఏ లబ్ది పొందకుండా ఎవరైనా ఎందుకు గిఫ్ట్ ఇస్తారు. అది కూడా ఈఎస్ఐ స్కాములో ఏ-14 ఉన్న వ్యక్తి గిఫ్ట్ ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి?. దీని వెనుకున్న నిజాలు బయటపడాలి. సీఎం అయిన దగ్గర నుండి అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యం అని చెప్తున్న జగన్.. మంత్రిపై చర్యలు తీసుకుంటారా? లేక మా పార్టీలో ఉన్నోళ్లు అంతా కడిగిన ముత్యాలు అంటూ అవినీతి మరకలతోనే ముందుకు సాగుతారో చూడాలి.

 

మంత్రి జయరాం మీద ఆరోపణలు కొత్తకాదు. ఈ ఏడాది కాలంలోనే ఆయనపైనా, ఆయన సన్నిహితులపైనా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన సమీప బంధువు పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. ఆయన అనుచరులు అక్రమంగా ఇసుక, మద్యం రవాణా చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆయనపై భూకబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బెంజ్ కార్ల లంచం ఆరోపణలు. అసలు ఒక మంత్రి పై ఇన్ని ఆరోపణలా. కారు తమ పేరు మీద ఉంటే రాజీనామా చేస్తానంటున్న మంత్రి.. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ అబద్దమని నిరూపిస్తారా?. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తారా?.