బెంగాల్ లో దుబ్బాక స్కెచ్! పీకే ఆడియోతో పరేషాన్ 

సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నిక గత నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య  హోరాహోరీ పోరు నడిచింది. పోలింగ్ కు ముందు రోజూ వరకూ ఎవరికి ఎడ్జ్ ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే పోలింగ్ రోజు ఉదయానికే సంచలన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరారన్నది దాని సారాంశం. ఈ వార్త నియోజకవర్గంలో చర్చగా మారింది. పోలింగ్ పైనా ప్రభావం చూపింది. సీన్ కట్ చేస్తే దుబ్బాక ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వెయ్యికి పైగా ఓట్లతో విజయం సాధించారు. 

దుబ్బాక ఉప ఎన్నిక లాంటి సీనే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్ లో జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత ఆందోళనకర పరిస్థితులు బెంగాల్ లో కనిపిస్తున్నాయి. బెంగాల్‌లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడుతుందా  ? లేక బీజేపీ అధికారం చేజిక్కించుకుంటుందా ? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కొద్దిపాటి మెజార్టీతో అయినా మమత మళ్లీ అధికారంలోకి వస్తారని కొన్ని సర్వేలు చెప్పినా.. బీజేపీ పుంజుకునే అవకాశం లేకపోలేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 

హోరాహోరీ పోరు సాగుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలోనే తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో లీకై కలకలం రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, మమత బెనర్జీ ఓటమికి కారణం కావొచ్చని ఆడియోలో పీకే వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ గా చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని  ప్రజలు భావిస్తున్నారని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు సమాచారం. 

ప్రశాంత్ కిషోర్ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో బెంగాల్ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అయితే ఈ ఆడియో టేప్ పై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఆడియో కాదని ఖండించారు. ఆడియోలో కొంత భాగం కాదు..మొత్తం ఆడియో చాట్ ను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగాల్ లో బీజేపీ 100 స్థానాలకు మించి గెలవదని ప్రశాంత్ జోస్యం చెప్పారు.