నాడు చంద్రబాబు.. నేడు కేసీఆర్

చంద్రబాబు బిచ్చగాళ్లను కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటూ ఆయనను ప్రత్యర్థులు తరచూ అనే మాట. అందుకు కారణం లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు ఉన్న కాలంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. వైట్‌హౌస్ నుంచి వర్తమానం అందిందో లేదో ఇక చూస్కోండి భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముఖ్యంగా బిచ్చగాళ్లను వేటాడి వెంటాడి.. వెతికి వెతికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దీనిపై అప్పట్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా వ్యవహరించక తప్పలేదని నాటి ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చుకున్నారు.

 

తాజాగా ఇప్పుడు చంద్రబాబు దారిలో నడవనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించేందుకు గానూ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు జరిగే సమయంలో హైదరాబాద్‌లోని యాచకులను నిర్బంధించాలని నిర్ణయించింది. అయితే అప్పట్లో లాగా భాగ్యనగరానికి దూరంగా పంపించకుండా వాళ్ల కోసం కేసీఆర్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యాచకులందిరినీ జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక వసతి గృహాలకు తరలించనుంది.

 

ఇందుకోసం చంచల్‌గూడ సెంట్రల్ జైలు వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోను పురుషు యాచకుల కోస.. దాని పక్కనే ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం కేటాయించనున్నారు. నవంబర్ 28 నుంచి 30 వరకు హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోడీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీల కంటికి నగరంలోని యాచకులు కనిపించకూడదని ప్రభుత్వం ఈ తరహా ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ యాచకుల నిర్మూలన చట్టం-1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.