TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీట్ పేపర్ లీక్ కేసులో బ్యూటీషియన్ అరెస్ట్‌తో దర్యాప్తు ముమ్మరం

Published on: Mon May 18, 2026 4:29PM

 

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. లీక్ వెనుక ఉన్న కీలక నెట్వర్క్‌పై దృష్టి సారించిన అధికారులు తాజాగా కీలక అరెస్టులు చేపట్టారు. పుణెలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న బ్యూటీషియన్ మనీషా వాఘ్మారేను సీబీఐ అరెస్ట్ చేయడం కేసులో పెద్ద మలుపుగా మారింది. ప్రశ్నాపత్రం లీక్ కుట్రలో ఆమె పాత్ర కీలకమని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. సీబీఐ సమాచారం ప్రకారం ప్రశ్నాపత్రం తయారీ ప్రక్రియలో సంబంధాలు కలిగిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్‌తో కలిసి వాఘ్మారే పథకం రచించినట్లు భావిస్తున్నారు. 

మే 14న ప్రొఫెసర్ మనీషా గురునాథ్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ, విచారణలో బయటపడిన సమాచారంతో బ్యూటీషియన్ మనీషా వాఘ్మారే ను అదుపులోకి తీసుకుంది. దర్యాప్తు సంస్థల అభిప్రాయం ప్రకారం, ప్రశ్నాపత్రం ముందుగానే పొందేందుకు ఏర్పాట్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో మరో కీలక అరెస్టు లాతూర్‌లో జరిగింది. రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ వ్యవస్థాపకుడు శివరాజ్ రఘునాథ్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన మొబైల్ ఫోన్ నుంచి ప్రశ్నాపత్రం లీకైనట్లు దర్యాప్తులో తేలినట్టు అధికారులు తెలిపారు.

ఈ కేసులో కోచింగ్ సెంటర్లు, మధ్యవర్తులు, పరీక్షా వ్యవస్థకు సంబంధిత వ్యక్తులు కలిసి పెద్ద నెట్వర్క్‌గా పనిచేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన సీబీఐ, ఈ లీక్ రాకెట్‌కు సంబంధించి మరికొంత మందిని విచారిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నీట్ పరీక్ష విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో, ఈ కేసును సీబీఐ అత్యంత ప్రాధాన్యంతో విచారిస్తోంది.