బోస్టన్ అంచ‌నా ప్ర‌కారం సెప్టెంబ‌ర్ వ‌ర‌కు క‌రోనా సెగ‌!

భార‌త్‌లో జూన్‌ 4వ వారం నుంచి సెప్టెంబర్‌ 2వ వారం మధ్య లాక్‌డౌన్‌ ఎత్తివేసుకోవచ్చని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తోంది. ఈ రిపోర్ట్ ప్ర‌కారం జూన్‌ 3వ వారంలో కరోనా భారత్‌లో పీక్‌స్టేజ్‌కు వెళ్తుంద‌నేది వారి అంచాన. కాబట్టి అప్పటి వరకు లాక్‌డౌన్ కొన‌సాగించాల‌ని బోస్ట‌న్ గ్రూప్ సూచించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి అమెరికాకు చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) వేర్వేరు స్థితులను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదిక రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో కరోనా నియంత్రణకు ఎలా వ్య‌వ‌హ‌రించారు? యాక్టివ్ కేసులు ఎన్ని, లాక్‌డౌన్ ఎంత కాలం అమ‌లుచేశారు? ప‌తాక‌స్థాయిలో ఎప్పుడు చేరుకున్నారు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది.

భార‌త్‌లో మార్చి 25 వరకు నమోదైన కేసుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితులు రోజురోజుకూ మారిపో తున్న నేపథ్యంలో తమ నివేదికను వైద్యం, భద్రతలకు సంబంధించిన సలహా సూచనలుగా పరిగణించరాదని, ప్రత్యామ్నాయాలుగానూ చూడరాదని స్ప‌ష్టంగా తెలిపింది.

భారత్‌లో కరోనా కేసులు జూన్‌ మూడో వారంలో పతాక స్థాయికి చేరతాయని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ అంచనా కట్టింది. నివేదికలో సూచించిన గ్రాఫ్‌ ప్రకారం జూన్‌ మూడో వారం నాటికి రోజూ 10 వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతాయి.

లాక్‌డౌన్‌ను ఎత్తివేసే సమయం గురించి ప్రస్తావిస్తూ.. ఇందుకోసం తాము చైనాలోని హుబే, వూహాన్‌ ప్రాం తాల్లో ఏ సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తి వేశారన్నదానికి ఆయా దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ సామర్థ్యం, నిర్దిష్ట జనాభాకు అందు బాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్య వంటివి పరిగణనలోకి తీసుకున్నామని వివరించింది. దీంతో పాటు వైరస్‌ బారిన పడ్డ వారిని సమర్థంగా ఐసోలేషన్‌లో ఉంచగల సామ ర్థ్యం కూడా ముఖ్యమేనని చెప్పింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ లో జూన్‌ ఆఖరు నుంచి సెప్టెంబర్‌ రెండో వారం మధ్యలో లాక్‌డౌన్‌ను ఎత్తేసేందుకు అవకాశముందని అంచనా కట్టింది.

భారత్‌లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుంటే లాక్‌డౌన్‌ను కొంచెం ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరమున్నట్లు బీసీజీ భావించింది. లాక్‌డౌన్‌ అనే ఆయుధాన్ని ప్రయోగించినందునే భారత్‌ కరోనా అనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగింది. వైరస్‌ గొలుసును అడ్డుకోగలుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనాసాగుతోంది.