రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ షాక్?
Published on: Wed Jan 21, 2026 8:54AM

టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందా? . 2026-27 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టుల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైన బీసీసీఐ వారిని ‘బీ’ గ్రేడ్ కు డిమోట్ చేయనుందా? అంటే క్రీడా వర్గాలలో ఔననే సమాధానమే వినిపిస్తోంది. సెంట్రల్ కాంట్రాక్టులలో మార్పులకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో ‘ఏ ప్లస్’ కేటగిరీని పూర్తిగా తొలగించి.. మూడు కేటగిరీలను మాత్రమే ఉంచాలన్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే ఆ ప్రభావం రోహిత్, కోహ్లీలపైనే ఎక్కువగా పడే అవకాశం ఉంది.
రో-కో (రోహిత్, కోహ్లీ) ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఒకే ఫార్మాట్ ఆడుతున్న కారణంగా వారిని ఏ ప్లస్ కేటగిరీ నుంచి ‘బీ గ్రేడ్’కు డిమోట్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న కోహ్లీ, రోహిత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఏడాదికి రూ.7 కోట్ల వేతనం అందుకుంటున్నారు. ఒకవేళ ఏ ప్లస్ గ్రేడ్ రద్దయితే జడేజా, బుమ్రాలను గ్రేడ్ ‘ఏ’కి మార్చే అవకాశముంది. త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో ఏ ప్లస్ గ్రేడ్ రద్దయితే కొత్తగా ‘డీ’ గ్రేడ్ ప్రవేశ పెడతారా? అన్న అంశంపైనా చర్చ జరుగుతోంది.


