TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా

Published on: Wed Oct 8, 2025 5:01PM

 

బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు నామినేషన్లు దాఖలు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. అటు రేపు మరి కొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్‌.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ కోటా పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285-ఏను సవరించామని అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇంకా లభించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.