ఆరో రోజుకి చేరుకున్న బతుకమ్మ సంబరాలు..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ చిన్నా, పెద్దా లయబద్ధంగా ఆడే బతుకమ్మతో తెలంగాణ పులకించిపోతోంది. ఈ నెల 20న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పండుగ తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 28న జరిగే సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన బతుకమ్మను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 

 

పండుగను పురస్కరించుకొని అక్కాచెల్లెమ్మలకు ఈ ఏడాది తొలిసారిగా కోటి ఆరు లక్షల బతుకమ్మ చీరలను పంచేందుకు నిశ్చయించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదింటి ఆడపడుచులకు సిరిసిల్ల చీరలను పంపిణీ చేయడం ద్వారా అటు చేనేతలకు, ఇటు పేద కుటుంబాలకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ఈ పథకాన్ని రూపొందించారు సీఎం. రాష్ట్రంలో దాదాపు 86 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి..తెల్ల కార్డు ఉన్న కుటుంబాలన్నింటికీ చీరలు పంపిణీ చేయాలని..ఈ మేరకు అవసరమయ్యే చీరల తయారీకి ఇప్పటికే చేనేత, జౌళి శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సీఎం నిర్ణయంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని దొరికినట్లయ్యింది. కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులతో సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమం దోహాదపడునుంది. 

 

అలాగే ఈ నెల 26న మహా బతుకమ్మ వేడుక నిర్వహించడానికి తెలంగాణ సాంస్కృతిక, పర్యాటకశాఖలు భారీ ఏర్పాట్లు చేశాయి. అలాగే 20వ తేది నుంచి రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బతుకమ్మ ఫిలిం ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆరో రోజు సందర్భంగా రవీంద్రభారతి ప్రధాన వేదికలో డాక్టర్ జయప్రద రామమూర్తి గారిచే ఫ్లూట్, శ్రీమతి భాగ్యలత & బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే బతుకమ్మ ఫిల్మోత్సవంలో భాగంగా..ప్రతీ ఫ్రేమ్‌లో తెలంగాణ నుడికారాన్ని, సంస్కృతిని మేళవించిన ఫిదా సినిమాను ప్రదర్శిస్తారు. అనంతరం అనిశ్ కురువిల్లా..డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాపై చర్చిస్తారు..

 


ఐదవ రోజు ఉత్సవాలు: ఐదవ రోజు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

పీపుల్స్ ప్లాజా: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలను పర్యాటక శాఖ ఛైర్మన్ పేర్వారం రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, ఐఏఎస్ అధికారుల కుటుంబసభ్యులు బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.

 

ప్రెస్ క్లబ్: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అడవి పూలకు పూజలు చేసే సంస్కృతి ఒక్క తెలంగాణకే ఉందని కవిత అన్నారు. గత సంవత్సరం బేటీబచావో నినాదంతో బతుకమ్మను నిర్వహించగా..ఈ యేడు బేటీపఢావో నినాదంతో నిర్వహించారు.

 

తెలంగాణ భవన్‌: తెలంగాణ భవన్‌లో జరిగిన ఉత్సవాల్లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొన్నారు. తోటి మహిళలతో కలిసి బతుకమ్మలను పేర్చి పూజ అనంతరం ఆడిపాడారు.

 

రవీంద్ర భారతి: ఐదవ రోజు బతుకమ్మ వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో రంగు రంగుల బతుకమ్మలను అలంకరించి..మహిళామణులందరూ ఆడిపాడారు..అలాగే బతుకమ్మ ఫిల్మోత్సవంలో భాగంగా శివరాజ్‌కుమార్ దర్శకత్వంలో..శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని ప్రదర్శించారు.

 

తెలంగాణా లోని ప్రతి ఊరు , ప్రతి వీధి , బతుకమ్మ తెచ్చిన పూల శోభతో వర్ణ రంజితం గా వుంది . రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు వల్ల అందరూ ఎంతో ఉత్సాహం గా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు . వాడ వాడలా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణా పులకించి పోయింది.